Reading Time: 2 minutes
Indian Railways: ట్రైన్‌ మిస్ అయ్యిందా? అదే టికెట్‌తో మరో రైలు ఎక్కవచ్చా? రైల్వే నియమాలు ఏం చెబుతున్నాయి?

Indian Railways: ప్రయాణ హడావిడిలో ఒక్కోసారి అనుకోకుండా రైలు మిస్ అవుతుంటాం. ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరడం, ట్రాఫిక్ జామ్ లేదా ఇతర కారణాల వల్ల ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చేసరికి రైలు వెళ్లిపోవచ్చు. ఇలాంటి సమయంలో చాలా మందికి వచ్చే మొదటి సందేహం.. “నా దగ్గర టికెట్ ఉంది కదా, ఇదే టికెట్‌తో తర్వాత వచ్చే మరో రైలులో వెళ్లవచ్చా?” అని. దీనిపై రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి కనీసం 30 నుండి 45 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవడం ఉత్తమం. ఇది సెక్యూరిటీ చెకింగ్, ప్లాట్‌ఫారమ్ వెతుక్కోవడానికి సరిపోతుంది. ఒకవేళ మీరు రైలును మిస్ అయితే, మీ టికెట్ రకాన్ని బట్టి నియమాలు మారుతుంటాయి.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి రద్దీ కోసం 18,262 ప్రత్యేక రైళ్లు!

రిజర్వేషన్ టికెట్ ఉంటే కుదురుతుందా?

మీరు కన్ఫర్మ్ అయిన రిజర్వేషన్ టికెట్ కలిగి ఉండి, రైలు మిస్ అయితే.. అదే టికెట్‌తో వేరే రైలులో ప్రయాణించడానికి వీలు లేదు. రిజర్వేషన్ టికెట్ అనేది ఒక నిర్దిష్ట రైలు. నిర్దిష్ట సీటు, నిర్దిష్ట సమయానికి మాత్రమే కేటాయించబడుతుంది. మీరు ఆ రైలు కాకుండా మరో రైలు ఎక్కితే, మీ వద్ద టికెట్ లేనట్లుగానే పరిగణిస్తారు.

జనరల్ టికెట్ పరిస్థితి ఏంటి?

సాధారణ (General) టికెట్ల విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ కూడా సమయ పరిమితి వర్తిస్తుంది. సాధారణంగా తక్కువ దూరం ప్రయాణించే అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కొన్నప్పటి నుండి నిర్ణీత గంటల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అయితే, ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్‌ఫాస్ట్ రైళ్ల కోసం తీసుకున్న టికెట్‌తో అదే కేటగిరీకి చెందిన తదుపరి రైలులో ప్రయాణించే అవకాశం కొన్నిసార్లు ఉంటుంది. కానీ, రూట్ మారకూడదు.

చట్టపరమైన చర్యలు, జరిమానాలు

చాలా మంది చేసే తప్పు ఏమిటంటే.. రాజధాని, శతాబ్ది లేదా వందే భారత్ వంటి ప్రీమియం రైళ్ల టికెట్ ఉన్నప్పుడు, అది మిస్ అయితే సాధారణ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేస్తారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఒక రైలు టికెట్‌తో మరో రైలులో ప్రయాణిస్తే టీటీఈ (TTE) మీకు భారీ జరిమానా (Penalty) విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది చట్టపరమైన సమస్యలకు కూడా దారి తీయవచ్చు.

ఏం చేయాలి?

ఒకవేళ రైలు మిస్ అయితే, వెంటనే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్‌ను సంప్రదించి TDR (Ticket Deposit Receipt) ఫైల్ చేయడం ద్వారా కొంత రీఫండ్ పొందే ప్రయత్నం చేయవచ్చు. ఆ తర్వాత మీ ప్రయాణం కోసం కొత్త టికెట్ తీసుకోవడమే సురక్షితమైన మార్గం. రైలు మిస్ అయితే అదే టికెట్‌తో రిస్క్ చేయకండి. జరిమానాలు చెల్లించడం కంటే, కొత్త టికెట్ తీసుకోవడం లేదా నిబంధనల ప్రకారం రీఫండ్ కోరడం మంచిది.

ఇది కూడా చదవండి: Buying Silver: వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట.. సర్వేలో షాకింగ్‌ నిజాలు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి