Reading Time: 2 minutes
Renu Desai: ఆ సమయంలో చావు వరకు వెళ్ళివచ్చా.. టీవీ9 ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్

రేణూ దేశాయ్.. పరిచయం అక్కర్లేని పేరు. నటిగా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు రేణూ దేశాయ్. ఇటీవలే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. సినిమాలతో పాటు సామజిక సమస్యల పై గొంతు విప్పుతూ ఉంటారు రేణూ.. సోషల్ మీడియా వేదికగా ఆమె ఎన్నో సమాజంలో జరిగే ఎన్నో విషయాల పై ప్రశ్నలు విసరడంతో పాటు తన అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. అంతే కాదు తన పై తన ఫ్యామిలీ పై నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి తనదైన స్టైల్ లో కౌంటర్లు ఇస్తుంటారు రేణూ దేశాయ్. తాజాగా రేణూ దేశాయ్ టీవీ9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ ఇంటర్వ్యూలో మనుషులంటే తనకు ఎందుకు విరక్తి కలిగిందో ఆమె వివరించారు. ఆన్‌లైన్‌లో తనకు రక్షణ అవసరమని, వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడం కష్టంగా మారిందని ఆమె పేర్కొన్నారు. అలాగే తన ఆరోగ్య సమస్యల గురించి, బరువు  పెరగడానికి గల కారణాలను వివరించి, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. రేణూ దేశాయ్ తన గుండె సమస్యకు చికిత్సగా బీటా-బ్లాకర్స్ అనే మందులను వాడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మందులు బరువు పెరిగేలా చేస్తాయని, శరీర జీవక్రియను మందగింపజేస్తాయని రేణు దేశాయ్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ మందులను వాడక తప్పలేదని, అప్పట్లో తనకు వేరే మార్గం లేదని ఆమె స్పష్టం చేశారు.

బీటా-బ్లాకర్స్ ప్రభావంతో తన శరీరం బాగా ఉబ్బిపోయిందని, గతంలో తాను పాల్గొన్న అనేక ఇంటర్వ్యూలలో ఈ ఉబ్బరం స్పష్టంగా కనిపించిందని రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు. ఆతర్వాత సహజ వైద్య విధానాల వైపు మొగ్గు చూపి, ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నానని వివరించారు. ఈ ప్రక్రియలన్నీ తన ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపాయని, కానీ ఇప్పుడు కోలుకుంటున్నానని తెలిపారు.  అలాగే తన అపెండిక్స్ సర్జరీ గురించి మాట్లాడుతూ.. చివరి నిమిషంలో ఆసుపత్రికి వెళ్లడంతో, కొన్ని గంటలు ఆలస్యమైతే ప్రాణాలు కోల్పోయి ఉండేదానిని అని వైద్యులు చెప్పారని రేణు దేశాయ్ తెలిపారు. ఆమె శరీరంలో తీవ్రమైన నొప్పి మొదలై, ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారట. వైద్య పరీక్షల అనంతరం, ఆమెకు తీవ్రమైన అపెండిసైటిస్ వచ్చిందని, అది సెప్సిస్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.