Reading Time: 2 minutes

దుబాయ్ ః ఇరాన్‌లోని పలు నగరాలు, ప్రత్యేకించి రాజధాని టెహరాన్‌ను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా సేనలు నిర్విరామంగా దాడులకు దిగుతున్నాయి. టెహరాన్ ఆకాశం ఎప్పుడూ నిప్పులు కక్కే రీతిలో మారుతోంది. క్షిపణులు, యుద్ధ విమానాలను ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు దేశాల దాడులతో ఇరాన్‌లో 555 మంది వరకూ పౌరులు మృతి చెందినట్లు, ఇది తమకు అదికారికంగా అంటే నిర్థారణ అయిన సమాచారం అని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సోమవారం తెలిపింది. క్రమేపీ టెహరాన్ కూడా గాజాలో మాదిరిగా అనుక్షణ దాడుల , ఆర్తనాదాల ప్రతీక అవుతుందనే భయాలు ఉన్నాయని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పుడు రెడ్‌క్రాస్ సొసైటి వెలువరించిన నివేదికతో ఇరాన్‌లోని 131 వరకూ నగరాలు, పట్టణాలపై దాడులు సాగుతున్నాయి.

ఇరాన్ నటాంజ్ అణుకేంద్రం ధ్వంసం?

ఇరాన్‌లోని అతి పెద్ద నటాంజ్ అణు కేంద్రం సోమవారం ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో దెబ్బతిందని, దీనితో బారీ స్థాయిలో అణుధార్మికత వెలువడుతోందని వార్తలు వెలువడ్డాయి. అంతర్జాతీయంగా ఈ అంశం కలవరం కల్గించింది. అయితే ఇటువంటి దాడి ఏమి జరగలేదని ఆ తరువాత అణు సంస్థ వివరణ ఇచ్చింది. ఐఎఇఎ అధినేత నుంచి ప్రకటన వెలువడింది. ఇందులో వైమానిక దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలకు ముప్పు వాటిల్లిందనే అంశం నిర్థారణ కాలేదని తెలిపింది. కానీ తమ అణు కేంద్రం దెబ్బతిందని ఈ సంస్థ పరిధిలో ఉండే ఇరాన్ రాయబారి రెజా నజాఫీ వాదించారు.

లెబనాన్‌లో హెజ్బుల్లా నేత ఖాసీం హతం

ఇరాన్‌తో ఇజ్రాయెల్ అమెరికా పోరు మరింతగా విస్తరించింది. హెజ్బుల్లా అధినేత నయీమ్ ఖాస్సీంను లెబనాన్‌లోని బీరూట్ ప్రాంతంలో తమ దాడుల్లో మట్టుపెట్టినట్లు ఇజ్రాయెల్ సోమవారం ప్రకటించింది. ఈ పరిణామ అత్యంత కీలక మలుపులకు దారితీసింది. తమకు నిమిత్తం లేకుండానే హెజ్బుల్లా శక్తులు లెబనాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని లెబనాన్ ప్రభుత్వం చెపుతోంది. అమెరికా మిత్రపక్షంగా ప్రకటించుకుంది. అయితే తమకు హెజ్బుల్లా అధినేత ఖాస్సీం అత్యంత కీలకమైన శత్రువు అని, ఖమేనీ తరువాత అంతటి తీవ్ర స్థాయి ప్రత్యర్థిని ఇప్పుడు మట్టుపెట్టామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్టూ అధికారికంగా ప్రకటించారు. బీరూట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ముందుగా అక్కడి పౌరులకు ముందస్తు జాగ్రత్తలు వెలువరించారు. తరువాత వైమానిక దాడులు జరిగాయి.

ఈ క్రమంలో 31 మంది వరకూ హెజ్బుల్లా మిలిటెంట్లు మృతి చెందారు. వీరిలో తాము నయీమ్‌ను గుర్తించినట్లు రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి దాడుల క్రమంలో బీరూట్ తల్లడిల్లింది. దాదాపుగా 150 మంది వరకూ పౌరులు గాయపడ్డారు. కాగా తమ ప్రాంతంలో హెజ్బుల్లా కార్యకలాపాలు చెల్లనేరవని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ బృందం వెంటనే తమకు ఆయుధాలతో లొంగిపోవాలని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్ టీవీ సందేశంలో తెలిపారు. యుద్ధంలో పాల్గొనాలా ? శాంతికి దిగాలా? అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇటువంటి అజ్ఞాత గ్యాంగ్‌లు కాదని ప్రధాని స్పష్టం చేశారు. హిజ్బుల్లా కార్యకలాపాలను నిషేధిస్తున్నామని, వీలైతే వారు రాజకీయాల్లోకి దిగవచ్చునని హితవు పలికారు. ఈ సంస్థ షియా ముస్లిం రాజకీయ సంస్థగా వెలిసింది.