Reading Time: 3 minutes

భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశం అని గర్వపడుతుంది. కానీ ఆ యువతకు అందుతున్న విద్యా నాణ్యత, పరిశోధనా సామర్థ్యం, మౌలిక వసతులు చైనాతో పోలిస్తే ఎంత వెనుకబడి ఉన్నాయో గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. భావోద్వేగ ప్రసంగాలు, అంతర్జాతీయ సదస్సులు, పెద్ద పెద్ద ప్రకటనలు ఒకవైపు ఉంటే, పాఠశాల స్థాయిలో ఉన్న కఠిన వాస్తవాలు మరోవైపు కనిపిస్తున్నాయి. యునెస్కో, ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం చైనా తన జిడిపి (గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్)లో సుమారు 4-6 శాతం వరకు విద్యకు కేటాయిస్తోంది. భారతదేశం సుమారు 3 నుండి 3.5 శాతం మధ్యే ఖర్చు చేస్తోంది. జాతీయ విద్యా విధానం 6 శాతం లక్ష్యాన్ని సూచించినప్పటికీ అది ఇప్పటికీ చేరుకోలేదు. పరిశోధన, అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) విషయంలో తేడా మరింత తీవ్రంగా ఉంది. చైనా తన జిడిపిలో 2.4 శాతం కంటే ఎక్కువను పరిశోధనకు వెచ్చిస్తుండగా, భారత్ సుమారు 0.7 శాతం వద్దే నిలిచిపోయింది. ఈ ఒక గణాంకమే రెండు దేశాల భవిష్యత్తు దిశను అర్థం చేసుకోవడానికి సరిపోతుంది.

చైనాలో ఉన్న విశ్వవిద్యాలయాల సంఖ్య 3000కు పైగా ఉంది. ట్సింగ్హువా యూనివర్శిటీ, పేకింగ్ యూనివర్శిటీ వంటి సంస్థలు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 50లో స్థానం సంపాదిస్తున్నాయి. మన దేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నా, ప్రపంచ టాప్ 100లో నిలిచే సంస్థలు అరుదుగా కనిపిస్తున్నాయి. పరిశోధనా పత్రాల ప్రచురణ, పేటెంట్ల నమోదు విషయంలో కూడా చైనా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంటే, భారత్ దూరంగా ఉంది. ప్రాథమిక విద్య స్థాయిలో పరిస్థితి మరింత ఆందోళనకరం. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులకు బోధించే పరిస్థితి ఉంది. పాఠశాల భవనాలు పాడైపోవడం, వర్షం కారే పైకప్పులు, మరుగుదొడ్లు లేకపోవడం, తాగునీరు లేకపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసలు (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) నివేదికలు పలుమార్లు చూపించినట్లుగా, ఐదో తరగతి చదివే పిల్లలు రెండో తరగతి పాఠ్యాన్ని కూడా సరిగా చదవలేకపోతున్నాడు. కొంతమంది పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం మాత్రమే పాఠశాలకు వస్తున్నారు అన్న వాస్తవం మనం ఒప్పుకోవాల్సిందే.

ఇలాంటి పరిస్థితుల్లో కంప్యూటర్ ఆధారిత విద్య, కృత్రిమ మేధస్సు, డిజిటల్ లెర్నింగ్, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడటం ఎంతవరకు వాస్తవంగా ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిరంతరంగా లేని చోట, ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని చోట, కంప్యూటర్లు లేని పాఠశాలల్లో ఎఐ ప్రయోగాలు ఎలా సాధ్యం? చైనా గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ మౌలిక వసతులు విస్తృతంగా అభివృద్ధి చేసింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రభుత్వ ప్రణాళికలో భాగమయ్యాయి. దేశంలో మరో సమస్య రాజకీయ ప్రాధాన్యతల లోపం. వందల వేల కోట్ల రూపాయల భారీ విగ్రహాల నిర్మాణానికి, ప్రచార కార్యక్రమాలకు వెచ్చిస్తుంటే, అదే స్థాయిలో విద్యా మౌలిక వసతులపై దృష్టి కనిపించడం లేదు. మతం, కులం, ప్రాంతీయత ఆధారంగా విద్వేషాలు రేపే రాజకీయ సంస్కృతి యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని బలహీనపరుస్తోంది. చైనా తన రాజకీయ వ్యవస్థపై విమర్శలు ఉన్నప్పటికీ, విద్య, పరిశోధన రంగాల్లో నిరంతర పెట్టుబడులు పెట్టింది.

ఫలితంగా సాంకేతిక రంగంలో అతి తక్కువ సమయంలోనే వంద సంవత్సరాలలో అమెరికా సాధించిన ఘనతను ఢీకొట్టే స్థాయిలో సైలెంట్‌గా, వేగంగా ఎలాంటి ఆర్భాటాలు, హంగామా ప్రకటనలు, ప్రచారాలకు దూరంగా పోటీపడి ఎదిగింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఎఐ సదస్సులో చైనా రోబో డాగ్‌ను ఒక కార్పొరేట్ యూనివర్శిటీ మార్కెట్‌లో కొనుగోలు చేసి, అది తమ స్వంత ఆవిష్కరణ అని ప్రచారం చేసిన ఘటన భారత ప్రతిష్ఠను అంతర్జాతీయంగా దెబ్బతీసింది. ఇలాంటి సంఘటనలు మన పరిశోధనా నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. నిజమైన ఆవిష్కరణకు దీర్ఘకాల పెట్టుబడులు, స్వతంత్ర ఆలోచన, శాస్త్రీయ సంస్కృతి అవసరం. భారత దేశానికి ప్రతిభ లోపం లేదు. మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చాటుతున్నారు. కానీ దేశీయ వ్యవస్థలో పెట్టుబడులు, మౌలిక వసతులు, పారదర్శక విధానాలు లేకపోతే ప్రతిభ వలస వెళ్తుంది. మెధో వలస (బ్రెయిన్ డ్రెయిన్) సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు ఈ పరిస్థితి ఒక హెచ్చరిక. విద్యను ఎన్నికల వాగ్దానంగా కాకుండా జాతీయ ప్రాధాన్యతగా చూడాలి. జిడిపిలో కనీసం 6 శాతం విద్యకు, 2 శాతం కంటే ఎక్కువ పరిశోధనకు కేటాయించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల మొదటి అడుగు కావాలి.

ప్రతి పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ తప్పనిసరి చేయాలి. సింగిల్ టీచర్ పాఠశాలలను నిర్మూలించి, ఉపాధ్యాయ నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలి. విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. సిలబస్‌లో మత విద్యను తొలగించి శాస్త్రీయ పరిశోధనకు నిధులు పెంచి, పరిశ్రమలతో అనుసంధానం బలోపేతం చేయాలి. కృత్రిమ మేధస్సు, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కోర్సులతో అధునాతన శాస్త్ర సాంకేతిక రంగాల్లో జాతీయ స్థాయి మిషన్లు అమలు చేయాలి. అయితే ఈ సాంకేతిక ప్రగతి పునాది బలమైన ప్రాథమిక, హైస్కూల్ విద్యే అన్న విషయాన్ని మరువకూడదు. మత, కుల రాజకీయాలు దేశాన్ని ముందు కు నెట్టవు. శాస్త్రీయ దృక్పథం, సమాన అవకాశాలు, నాణ్యమైన ప్రభుత్వ విద్య మాత్రమే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయి. చైనా మోడల్‌ను గుడ్డిగా అనుసరించడం అవసరం లేకపోయినా, దీర్ఘకాల ప్రణాళిక, భారీ పెట్టుబడులు, కఠినంగా అమలు చేయటం వంటి అంశాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పటికైనా పాలకులు, ప్రతిపక్షాలు, మేధావులు కలిసి విద్యా విప్లవానికి కట్టుబడాలి. లేకపోతే ప్రపంచం ముందుకు దూసుకుపోతుండగా, మనం అంతర్గత విభేదాల్లో చిక్కుకుని వెనుకబడిపోతాం. భవిష్యత్తు తరాల కోసం ఇప్పుడే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే పతనం తప్పదు.

– డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496