Reading Time: < 1 minute

ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే అమలు చేసేంత వరకూ రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. డూప్లికేట్ గాంధీ కుటుంబానికి మూటలు పంపి పదవులు కాపాడుకోవాలనే తాపత్రయమే తప్ప 6 గ్యారంటీల అమలుపై మంత్రివర్గ సమావేశంలో ఎప్పుడైనా చర్చించారా? అని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.డూప్లికేట్ గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్ల రూపాయలు పంపించాలన్న శ్రద్ధే తప్ప మీకు ప్రజా సమస్యలు పట్టవా? అని ఆయన ముఖ్యమంత్రిని ఉద్ధేశించి ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెలా రూ. 2500లు ఇస్తామని చెప్పి రెండేళ్ళు దాటినా ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు. అవ్వాతాతలకు ప్రతి నెలా రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇవ్వడంపై, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డును ఎందుకు ఇవ్వలేకపోతున్నామని,

నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ అమలుపై ఎన్నడైనా మంత్రివర్గంలో ఎప్పుడైనా చర్చించారా ? అని ఆయన ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వేలాది యాజమాన్యాలు అల్లాడుతున్న సంగతి మర్చిపోయారా?, ఆరోగ్యశ్రీ బకాయిలివ్వకపోవడంతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందక పేదల బాధలు మీకు పట్టవా? అని ఆయన ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలు సాధ్యాసాధ్యాలపై ఎందుకు చర్చించడం లేదని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తమ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రావు ఆధ్వర్యంలో 6 గ్యారంటీల అమలుపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.