Reading Time: < 1 minute

విమానయాన రంగంలో అనాథ యువతకు శిక్షణ ఇచ్చి వారి జీవితానికి భరోసా కల్పిస్తూ మంచి భవిష్యత్తు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అనాథ పిల్లల నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనతో పాటు అంగన్వాడీ టీచర్ల వృత్తి నైపుణ్యాభివృద్ధి దిశగా పలు కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వ సంరక్షణలో, శక్తి సదన్‌లో ఉంటున్న ఉన్న అనాథ యువతకు విమానయాన రంగంలో నైపుణ్య శిక్షణ అందించేందుకు జిఎంఆర్ ఎయిరో అకాడమి తో ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమం 2026 మార్చి నెల నుంచి శంషాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు ఆపరేషన్స్, కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి కోర్సుల్లో దశల వారీగా శిక్షణ ఇచ్చి, ప్రైవేట్, అంతర్జాతీయ స్థాయి విమానయాన సంస్థల్లో ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. మొదటి విడతలో 20 మంది అనాథ యువతకు శిక్షణ అందించనున్నారని, ఆ తర్వాత బ్యాచ్‌ల వారీగా అర్హులందరికి శిక్షణ ఇస్తారని వివరించారు. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ ఎయిర్పోర్ట్ అథారిటీ హెడ్ కే.అనంతరామన్, ఆపరేషన్స్ హెడ్ ప్రీతి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా హాజరయ్యారు.