Reading Time: < 1 minute

ఎపిలో ఎసిబి అధికారులు దూకుడు పెంచారు. లంచం తీసుకుంటున్న పోలీస్ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే రూ.3 లక్షలు లంచం తీసుకుంటున్న ఇద్దరు పోలీసు అధికారులను సోమ వారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే పులివెందుల రూరల్ సిఐ ఎన్.వి. రమణ, సింహాద్రిపురం ఎస్‌ఐ దాసరి అనిల్ కుమార్ చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి నుంచి రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దొంగిలించిన బైకులతో నేరాలకు పాల్పడుతున్న

ఈ కేసులో అనుకూలంగా వ్యవహరిస్తామని వారు హామీ ఇచ్చారు. దీంతో బాధితుడు మొదట కొంత మొత్తం చెల్లించాడు. మిగిలిన డబ్బు కోసం పోలీసులు ఒత్తిడి చేయడంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగం లోకి దిగిన ఎసిబి అధికారులు, సింహాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో పక్కా ప్రణాళికతో వలపన్నారు. బాధితుడు రూ.3 లక్షలను ఎస్‌ఐ అనిల్ కుమార్ కు అందజేస్తుండగా, అక్కడే మాటువేసిన ఎసిబి అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సిఐ రమణను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

శ్రీకాకుళంలో ఎంఇఒ, విజయనగరంలో విఆర్‌ఒ పట్టివేత

అదే విధంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడి నుంచి రూ.10,000 లంచం తీసుకుంటున్న మండల విద్యాధికారి (ఎంఇఒ) కుర్మాన అప్పారావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉప్పాడ కామేశ్వరరావును ఎసిబి అధికారులు పట్టుకున్నారు. మరో ఘటనలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్‌ఒ) ఆర్. చిట్టిబాబు కూడా లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు.