Reading Time: < 1 minute

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ అకాల వర్షాలు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: అకాల వర్షాల కాలం మళ్లొస్తున్నది. చలికాలం ఇట్ల ముగిసిందో లేదో.. వర్షాలు పడేందుకు వాతావరణం మారిపోతున్నది. ఈ నెల 22 నుంచి (ఆదివారం) మూడు రోజులపాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని.. మరో 24 గంటల్లో అది వాయువ్య బంగాళాఖాతంవైపు కదిలి బలహీనపడే అవకాశం ఉందని, అదే సమయంలో శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకూ అవకాశం ఉందని పేర్కొంది.

దీని ప్రభావంతో కేరళ, తమిళనాడుకు భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ.. తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే చాన్స్​ ఉందని వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

మరోవైపు రాష్ట్రంలో కొన్నిచోట్ల వరి పంట ప్రారంభదశలో ఉండగా.. మరికొన్ని చోట్ల ఎదిగిన దశలో ఉంది. అదే సమయంలో మొక్కజొన్న పంట కంకి దశకు చేరుకున్నది. దీంతో ఈ అకాల వర్షాల వల్ల నష్టం కలిగే ఆస్కారం ఉంది. రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.