Reading Time: < 1 minute

మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో విషాదం: కలశ యాత్రలో తొక్కిసలాట, మహిళ మృతి..

Caption of Image.

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలోని దాబ్రా పట్టణంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. భక్తితో జరుగుతున్న కలశ యాత్రలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఏం జరిగిందంటే :
మాజీ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఆధ్వర్యంలో నవగ్రహ పీఠ్ కలశ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేల మంది భక్తులు తరలివచ్చారు.  ఊరేగింపు జరుగుతుండగా జనం ఒక్కసారిగా ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో చాలా మంది కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా… గాయపడిన వారిని వెంటనే  ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

మృతురాలి మరణవార్త విన్న ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ, ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుండి నేరుగా యాత్ర జరుగుతున్న ప్రదేశానికి తీసుకువెళ్లి నిరసన తెలిపారు. పోలీసులు, అధికారులు సక్రమంగా జనాన్ని నియంత్రించి ఉంటే ఈ ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

నవగ్రహ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఫిబ్రవరి 20 వరకు కొనసాగనున్నాయి. రాబోయే రోజుల్లో కూడా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో భద్రతపై ఆందోళన నెలకొంది.   ప్రజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు భద్రతా ఏర్పాట్లు ఎంత బలహీనంగా ఉన్నాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.