Reading Time: < 1 minute

వీడియోకాల్లో మాట్లాడుతూ ఉరివేసుకున్న ఐటీఐ విద్యార్థి.. మేడిపల్లిలో విషాద ఘటన

Caption of Image.

మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐటీఐ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడిపల్లి పరిధిలోని బోడుప్పల్లో ఈ ఘటన జరిగింది.వివరాల్లోకి వెళ్తే..

మేడిపల్లికి చెందిన 17 ఏళ్ల గంగధారి అభినవ్ స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. చదువుతో పాటు మేడిపల్లిలోని ఓ కార్ల షోరూంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం (ఫిబ్రవరి 6) ఇంట్లో ఉన్న సమయంలో అభినవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఘటన సమయంలో స్నేహితురాలితో వీడియో కాల్లో మాట్లాడుతున్నట్లు సమాచారం. పరిస్థితిని గమనించిన ఆమె వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం అందించింది. వారు సంఘటన స్థలానికి చేరుకుని అభినవ్​ను  కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. యువత మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

©️ VIL Media Pvt Ltd.