Reading Time: < 1 minute

ఇయ్యాల ఫిబ్రవరి 8న భూపాలపల్లికి సీఎం రాక

Caption of Image.
  • కోటంచ ఆలయంలో మొక్కులు
  • మధ్యాహ్నం 3 గంటలకు భూపాలపల్లి లో బహిరంగ సభ

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు:  భూపాలపల్లి జిల్లాలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.  మధ్యాహ్నం 2.30 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా కోటంచ క్షేత్రానికి చేరుకుంటారు.  స్వామివారికి మొక్కులు చెల్లించుకుని రూ. 12.15 కోట్లతో నిర్మాణం పూర్తయిన వీఐపీ అతిథి గృహన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్​ శివారులో నిర్వహించే ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమంలో పాల్గొననున్నారు.  

సీఎం పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో 1100 మంది పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.  జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ ఏరియాతో పాటు ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబ్‌‌‌‌, డాగ్ స్క్వాడ్ టీంలు తనిఖీలు ముమ్మరం చేశారు.  రోప్​ పార్టీ బలగాలు మోహరించారు. ట్రాఫిక్​ నియంత్రణ, బహిరంగ సభకు పబ్లిక్ తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. 

సభకు భారీగా తరలిరావాలి

ఆదివారం జిల్లాలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి హజరయ్యే  బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపు నిచ్చారు. సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ డెవలప్​మెంట్ కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అటవీ సరిహద్దు కాలనీల్లో ప్రజల రక్షణ కోసం ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. మోరంచ, చలివాగు నీటిని సంవృద్ధిలోకి తెచ్చేలా లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు వరద రాజేశ్వర్ రావు, ట్రేడ్ కార్పొరేషన్​ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్​, చల్లూరి మధు తదితరులు పాల్గొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.