Reading Time: 2 minutes

లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్.. కొత్త రూల్స్ తీసుకొస్తున్న రిజర్వు బ్యాంక్..

Caption of Image.

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి లోన్స్ తీసుకున్న వారికి వేధింపుల నుంచి విముక్తి కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్  సంచలన నిర్ణయం తీసుకుంది. లోన్ రికవరీ ఏజెంట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల రికవరీ ఏజెంట్లు అనుసరిస్తున్న దురుసు ప్రవర్తన, బెదిరింపులు, బలవంతపు వసూళ్లపై ఫిర్యాదులు పెరుగుతున్న వేళ.. వినియోగదారుల రక్షణే ధ్యేయంగా కేంద్ర బ్యాంక్ ఈ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఏజెంట్ల తీరుపై బ్యాంకులను నేరుగా బాధ్యులను చేస్తూ కొత్త డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌ను రూపొందించనున్నారు.

ఈ కొత్త సంస్కరణల్లో భాగంగా మూడు కీలకమైన మార్గదర్శకాలను ఆర్‌బీఐ విడుదల చేయనుంది. మొదటిది ఆర్థిక ఉత్పత్తుల మిస్ సెల్లింగ్ అరికట్టడం.. రెండోది లోన్ రికవరీ ఏజెంట్ల నియామకం వారి పనితీరును నియంత్రించడం. ఇక మూడోది అనధికారిక ఎలక్ట్రానిక్ లావాదేవీల వల్ల కస్టమర్లకు కలిగే నష్టాన్ని పరిమితం చేయడం. వీటితో పాటు డిజిటల్ మోసాలకు గురయ్యే సామాన్యులకు భరోసా ఇస్తూ.. చిన్న విలువ కలిగిన మోసపూరిత లావాదేవీల్లో నష్టపోయిన కస్టమర్లకు రూ.25వేల వరకు పరిహారం అందించే సరికొత్త విధానాన్ని కూడా ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇది డిజిటల్ బ్యాంకింగ్ వినియోగదారులకు ముఖ్యంగా సాంకేతికతపై పెద్దగా అవగాహన లేని వారికి కొండంత అండగా నిలవనుంది.

►ALSO READ | సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి..? ఆన్‌లైన్ మోసాల నుండి మిమ్మల్ని ఎలా కాపాడుతుంది?

ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం కూడా రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లకు ఫోన్ చేయటం లేదా వారిని కలవటానికి అనుమతి ఉంది. శారీరక హింస, అసభ్య పదజాలం వాడటం, ఇరుగుపొరుగు వారికి లేదా బంధువులకు లోన్ వివరాలు వెల్లడించడం వంటివి పూర్తిగా నిషేధం. అయినప్పటికీ గ్రౌండ్ లెవల్లో ఈ రూల్స్ అమలు కాకపోవడంతో ఆర్‌బీఐ ఇప్పుడు పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తోంది. ఇకపై రికవరీ ఏజెంట్ల ప్రవర్తనలో ఎలాంటి లోపాలున్నా అది సదరు బ్యాంక్ వైఫల్యంగానే పరిగణించబడుతుంది. దీనివల్ల బ్యాంకులు తమ ఏజెంట్లపై మరింత పటిష్టమైన నియంత్రణను కలిగి ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది.

అంతేకాకుండా సీనియర్ సిటిజన్లు వంటి సున్నితమైన వినియోగదారుల కోసం డిజిటల్ చెల్లింపుల భద్రతను మెరుగుపరచడానికి ఎక్స్‌ట్రా అథెంటికేషన్.. క్రెడిట్ ఆలస్యం వంటి అంశాలపై ఆర్‌బీఐ ఒక చర్చా పత్రాన్ని కూడా విడుదల చేయనుంది. లోన్ తీసుకున్న వ్యక్తిని గౌరవప్రదంగా చూడాలని, అక్రమ పద్ధతుల్లో వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆర్‌బీఐ స్పష్టం చేస్తోంది. ఈ నిర్ణయం వల్ల లోన్ తీసుకున్న లక్షలాది మంది సామాన్యులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా.. బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పెరిగే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.