Reading Time: < 1 minute

గురుకుల డిగ్రీ లెక్చరర్లపై పని ఒత్తిడిని తగ్గించండి : టీఎస్డీసీఈఏ

Caption of Image.
  •     ప్రభుత్వానికి టీఎస్డీసీఈఏ విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: గురుకుల డిగ్రీ కాలేజీ లెక్చరర్లపై పని ఒత్తిడిని తగ్గించాలని టీఎస్డీసీఈఏ ( తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఎంపవరింగ్ అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సాంబలక్ష్మి, రమాదేవిలు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల ప్రకారం.. 8 గంటల పని విధానం అమలవుతుంటే.. ప్రభుత్వ ఆధీనంలోని గురుకుల డిగ్రీ కాలేజీల రెగ్యులర్ లెక్చరర్లు మాత్రం ఉదయం 8:45 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 01:00 గంటల వరకు నిర్విరామంగా 28 గంటలు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వారానికి రెండు నుంచి మూడు నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తున్నదని..ఆయా రోజుల్లోనే వరుసగా 28 గంటలు పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.  రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని సుమారు వెయ్యి మంది డిగ్రీ లెక్చరర్లు ఇలా కష్టపడుతున్నారని ఓ ప్రకటనలో వెల్లడించారు. వారంతా టీచింగ్ తో పాటు హాస్టల్స్ లో వార్డెన్ డ్యూటీ పేరుతో మానిటరింగ్ చేస్తున్నారని..వారిపై ఉన్నతాధికారులు కఠిన రూల్స్ అమలు చేస్తున్నారని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెప్పారు. 

టైం టేబుల్ ప్రకారం ఉదయం 8:45 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉండగా, రాత్రి డ్యూటీ రోజు  ఉదయం 8:45 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 01:00 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారన్నారు. 28 గంటలు ఎకధాటిగా కళాశాలలోడిగ్రీ లెక్చరర్లు ఉండి టీచింగ్, వార్డెన్ డ్యూటీలు చేస్తున్నారని వివరించారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్నారు. 

©️ VIL Media Pvt Ltd.