Reading Time: < 1 minute

అజిత్ పవార్ ప్రమాదవశాత్తూ చనిపోలేదా..? శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఏమన్నారంటే..?

Caption of Image.

ముంబై: దివంగత నేత అజిత్ పవార్ మరణంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ హాట్ కామెంట్స్ చేశారు. అజిత్‌ పవార్ అకాల మరణంపై అనుమానాలు ఉన్నాయని.. ఆయన మరణం వెనక కుట్ర కోణం దాగి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. 

ఎన్సీపీ రెండు వర్గాల విలీనానికి చర్చలు మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం పలు సందేహాలకు తావిస్తోందన్నారు. ప్రమాదానికి ముందు శరద్ పవార్ వర్గంతో కలిసేందుకు అజిత్ పవార్ సుముఖత వ్యక్తం చేశారని.. ఇది ఇష్టం లేని బీజేపీ ఆయనపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు.

విలీనం విషయంలో అజిత్ వెనక్కి తగ్గకపోవడంతో అతడిని బెదిరించేందుకు బీజేపీ నీటిపారుదల కుంభకోణం తెరపైకి తెచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎపిసోడ్ జరిగిన కొన్ని రోజుల్లోనే అజిత్ పవార్ ఆకస్మిక మరణం బాధాకరమన్నారు. అజిత్ పవార్ మరణం తర్వాత వెలుగులోకి వస్తోన్న అంశాలన్నింటిని నిశితంగా పరిశీలిస్తే ఇక్కడ ఏదో సందేహాస్పదంగా ఉందని.. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.  

ఎన్సీపీ చీఫ్​, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న విమానం 2026, జనవరి 28న బారామతి ఎయిర్ స్ట్రిప్‎లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

©️ VIL Media Pvt Ltd.