Reading Time: 2 minutes
టీ20 ప్రపంచకప్ లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అతడే.. టీమిండియా సెన్సేషన్ పై రికీ పాంటింగ్ ప్రసంశలు..

Player Of The Tournament For T20 World Cup: 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా నిలుస్తారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడమే కాకుండా, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా గెలుచుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఐసీసీ ఈవెంట్లలో పెద్దగా అనుభవం లేకపోవడం అభిషేక్‌కు ఒక రకంగా కలిసొస్తుందని పాంటింగ్ విశ్లేషించారు. 25 ఏళ్ల అభిషేక్ శర్మ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ ద్వారా తన టీ20 ప్రపంచకప్ అరంగేట్రం చేయబోతున్నాడు.

“అతడొక స్టార్,” అని ఐసీసీ రివ్యూ (The ICC Review) తాజా ఎడిషన్‌లో పాంటింగ్ పేర్కొన్నారు. “నిజం చెప్పాలంటే, అనుభవం లేకపోవడం అనేది అతనికి సానుకూల అంశం. అతను అత్యధిక పరుగులు చేయడమే కాకుండా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది” అంటూ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

“అతను అంతటి ప్రతిభావంతుడని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అతను రాణిస్తే భారత్‌ను ఓడించడం ఎవరికైనా కష్టమవుతుంది. అతను విఫలమైతే, భారత్ కూడా మిగతా జట్లలాగే ఒత్తిడికి లోనవుతుంది. అందుకే ఈ ప్రపంచకప్‌లో భారత్ తరపున అతను చాలా కీలకమైన ఆటగాడని నేను అనుకుంటున్నాను” అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.

“17 ఏళ్ల వయసులోనే ఆ మెరుపులు చూశా”..

ఐపీఎల్ ప్రారంభ రోజుల్లో అభిషేక్ శర్మతో కలిసి పనిచేసిన అనుభవంతో, గ్లోబల్ స్టేజ్‌పై అతను ఒత్తిడికి గురికాడని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశారు. “నేనే అతని మొదటి ఐపీఎల్ కోచ్‌ని,” అని ఢిల్లీ క్యాపిటల్స్‌లో తన అనుభవాన్ని పాంటింగ్ గుర్తు చేసుకున్నారు. “నా హయాంలోనే అతను 17 ఏళ్ల వయసులో ఢిల్లీ తరపున అరంగేట్రం చేశాడు. మొదటి బంతినే బౌలర్ తల పైనుంచి క్లాసికల్ షాట్‌తో ఫోర్ లేదా సిక్స్ కొట్టి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అప్పుడే అతనిలో ఏదో తెలియని అద్భుతమైన ప్రతిభ ఉందని నాకు అర్థమైంది” అంటూ చెప్పుకొచ్చాడు.

అభిషేక్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి ట్రేడ్ చేయడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని కూడా పాంటింగ్ వెల్లడించారు. “అతన్ని వదులుకోవద్దని నేను మేనేజ్‌మెంట్‌ను బతిమిలాడాను. ఒక అద్భుతమైన సూపర్‌స్టార్ తయారవుతున్నాడని చెప్పాను. ఇప్పుడు అది నిజమైంది” అంటూ తెలిపాడు.

అద్భుత ఫామ్ లో అభిషేక్ శర్మ..

2018 అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడైన అభిషేక్, ఇప్పుడు తన మొదటి సీనియర్ టీ20 ప్రపంచకప్ ఆడబోతున్నాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 152 పరుగులతో దుమ్మురేపాడు.

మూడో మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఇది టీ20ల్లో భారత్ తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ.

2007లో ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన యువరాజ్ సింగ్ మాత్రమే అభిషేక్ కంటే ముందున్నాడు.

వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలనే భారత ప్రయత్నంలో అభిషేక్ కీలక పాత్ర పోషించనున్నాడు. గ్రూప్-A లో ఉన్న భారత్, ఫిబ్రవరి 7న అమెరికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..