Reading Time: < 1 minute

కూకట్ పల్లి‎ ప్రగతినగర్‌లో ఘనంగా ఆర్ట్ గాలా–పెయింటింగ్ ఎగ్జిబిషన్

Caption of Image.

హైదరాబాద్: కూకట్ పల్లి‎లోని ప్రగతినగర్‌లో ఉన్న సుందరయ్య భవన్ వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 1) ఆర్ట్ గాలా (ART GALA) పేరిట నిర్వహించిన గ్రాండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఘనంగా ముగిసింది. కళా రంగంలో 40 ఏళ్ల అనుభవం కలిగిన ప్రముఖ చిత్రకారుడు గాదిరాజు మానస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ వయసుల కళాకారులు రూపొందించిన ఆకట్టుకునే చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకర్షించాయి.

ప్రకృతి, మనస్సు, ఊహలు, మానసిక వికాసాన్ని ప్రతిబింబించే పెయింటింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుల్వి ఆర్ట్ స్కూల్ ద్వారా వేలాది మంది పిల్లలకు చిత్రకళలో శిక్షణ అందించిన గాదిరాజు మానస, ఈ ఎగ్జిబిషన్ ద్వారా వారి శిష్యుల ప్రతిభను మరోసారి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. 4 ఏళ్ల చిన్నారుల నుంచి 40 ఏళ్ల వయస్సు వరకు ఉన్న కళాకారుల చిత్రాలు ప్రదర్శనకు రావడంతో సందర్శకులు ఉత్సాహంగా తిలకించారు. ప్రత్యేకించి స్పెషల్ కిడ్స్, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పిల్లలు రూపొందించిన కళాఖండాలు అందరి మనసులను కదిలించాయి. 

పెయింటింగ్ ద్వారా వారి ఏకాగ్రత, మనో వికాసం ఎలా పెరుగుతుందో ఈ ప్రదర్శన స్పష్టంగా చాటింది. ఈ ఎగ్జిబిషన్‌లో చిత్రాల ప్రదర్శనతో పాటు అమ్మకానికి కూడా అవకాశం కల్పించగా, పలువురు కళాభిమానులు పెయింటింగ్‌లను కొనుగోలు చేశారు. కళకు ప్రోత్సాహం అందించడంలో భాగంగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని నిర్వాహకులు తెలిపారు. కళ మన జీవితంలో భాగమేనని, దేశ నిర్మాణంలోనూ ఆర్ట్‌కు కీలక పాత్ర ఉందని ఈ ఆర్ట్ గాలా మరోసారి నిరూపించిందని కళాభిమానులు అభిప్రాయపడ్డారు.

©️ VIL Media Pvt Ltd.