
మల్టీప్లెక్స్‌కు వెళ్లి సినిమా చూద్దామనుకున్న ఒక న్యాయవాదికి కౌంటర్ వద్ద వింత అనుభవం ఎదురైంది. టికెట్, స్నాక్స్ కోసం క్యాష్ ఇస్తే తీసుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. డిజిటల్ పేమెంట్ (UPI) మాత్రమే చేయాలని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అడ్వొకేట్ ఉత్కర్ష్ దేవ్.. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ PVR INOXకి లీగల్ నోటీసు పంపారు.
సెప్టెంబర్ 13న సినిమా చూసేందుకు మల్టీప్లెక్స్ కు వెళ్లగా.. ఉత్కర్ష్ దేవ్ కు ఈ వింత అనుభవం ఎదురైంది. ఆర్‌బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 26(1) ప్రకారం భారతీయ కరెన్సీ నోట్లు చట్టబద్ధమైన కరెన్సీ (Legal Tender). అలాంటప్పుడు నగదును అంగీకరించకపోవడం వినియోగదారుల హక్కులను కాలరాయడమేనని నోటీసులో పేర్కొన్నారు. ‘క్యాష్‌లెస్ పాలసీ’ ఉంటే ఆ విషయాన్ని కౌంటర్ వద్ద ముందే స్పష్టంగా ఎందుకు ప్రదర్శించలేదు. అసలు స్మార్ట్‌ఫోన్ లేదా UPI లేని సామాన్య వినియోగదారుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై 7 రోజుల్లోగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే, ఈ అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయం మరోలా ఉంది. ప్రైవేట్ వ్యాపార సంస్థలు తమ సేవల నిబంధనలను స్వయంగా నిర్ణయించుకునే హక్కు కలిగి ఉంటాయని జోట్వానీ అసోసియేట్స్ భాగస్వామి దిన్కర్ శర్మ తెలిపారు. ప్రత్యేకమైన చట్టపరమైన ఆంక్షలు లేనంతవరకు, ఏ ప్రైవేట్ సంస్థ అయినా డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యత ఇస్తూ ‘క్యాష్‌లెస్ పాలసీ’ని అమలు చేయవచ్చని చెప్పారు.
అయితే, ఆ విధానాన్ని వినియోగదారులకు ముందే స్పష్టంగా తెలియజేయడం బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా అడుగులు వేస్తున్న వేళ.. నగదును పూర్తిగా తిరస్కరించడం ఎంతవరకు సమంజసమనే దానిపై ఈ ఘటన సరికొత్త చర్చకు తెరలేపింది..