
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపు లభించింది. ఢిల్లీలో జరుగుతున్న మూడో జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ సదస్సులో తెలంగాణ ఈగల్ ఫోర్స్’ జాతీయ స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్దేశించిన 7 కీలక ప్రమాణాల్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం 80 శాతానికి పైగా మార్కులు సాధించి సత్తా చాటింది.ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, సింథటిక్ డ్రగ్స్ నియంత్రణ, మెరుగైన ప్రాసిక్యూషన్, లీగల్ స్క్రూటినీ, జ్యుడీషియల్ అనాలిసిస్ , సాక్షుల రక్షణపై ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి అమలు చేశారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఈగల్ ఫోర్స్ , జిల్లా పోలీసులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, అధికారులు, సిబ్బందిని డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. భవిష్యత్ తరాలను డ్రగ్స్ ప్రభావం నుంచి కాపాడటమే లక్ష్యంగా, యువత ఈ బారిన పడకుండా నిరోధక చర్యలను మరింత బలోపేతం చేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్‌తో పాటు యాంటీ నార్కోటిక్స్‌లోనూ తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు.