Reading Time: 2 minutes

రూ.కోటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించిన కర్నూలు కోర్టు.. HDFCపై గెలిచిన మహిళ

Caption of Image.

పాలసీ తీసుకునేటప్పుడు కస్టమర్ ఆదాయాన్ని పెంచి చూపారని సాకు చెప్పి కోటి రూపాయల యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను రిజెక్ట్ చేసిన ఇన్సూరెన్స్ సంస్థకు వినియోగదారుల కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆదాయం తప్పుగా చూపారన్న ఆరోపణలను ఇన్సూరెన్స్ కంపెనీ నిరూపించలేకపోయిందని స్పష్టం చేస్తూ.. నామినీకి రూ.కోటి ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తంతో పాటు పరిహారం చెల్లించాలని కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంచలన తీర్పు ఇచ్చింది.

అసలు వివాదం ఏమిటి?
కర్నూల్‌కు చెందిన ఒక వ్యక్తి హెచ్‌ఎస్‌బీసీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర రూ.కోటి హామీతో ‘కోటి సురక్ష పాలసీ’ తీసుకున్నారు. దీనికోసం క్రమం తప్పకుండా ఏటా రూ.30వేల 365 ప్రీమియం కూడా చెల్లించారు. అయితే దురదృష్టవశాత్తు జూలై 28, 2025న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్, పోస్ట్‌మార్టం రిపోర్ట్, ఛార్జ్‌షీట్ ద్వారా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమేనని నిర్ధారించారు. దీంతో మృతుని భార్య రూల్స్ ప్రకారం కోటి రూపాయల క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర.

క్లెయిమ్ తిరస్కరణ..
ప్రమాదం నిజమే అయినప్పటికీ.. పాలసీ తీసుకునే సమయంలో ఆ వ్యక్తి తన ఆదాయాన్ని తప్పుగా, ఎక్కువగా చూపించారంటూ హెచ్‌ఎస్‌బీసీ ఎర్గో సంస్థ ఆ క్లెయిమ్‌ను రిజెక్ట్ చేసింది. దీనిపై బాధిత కుటుంబం కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. విచారణ సందర్భంగా.. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, కేవలం అనుమానాల ఆధారంగా క్లెయిమ్ తిరస్కరించడం సరికాదని కోర్టు తేల్చిచెప్పింది. ఆదాయం తప్పుగా చూపడం ఉద్దేశపూర్వక మోసమని నిరూపించడంలో ఇన్సూరెన్స్ కంపెనీ విఫలమైందని స్పష్టం చేసింది. కేవలం దర్యాప్తు సంస్థల అనుమానాలను మోసంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.

కోర్టు జారీ చేసిన ఆదేశాలు..
ఫ్యాక్టరీ, లారీలు, వ్యవసాయ భూములు కలిగిన ఆ వ్యక్తికి సరిపడా ఆదాయ వనరులు ఉన్నాయని కోర్టు గుర్తించింది. ఇన్సూరెన్స్ కంపెనీ తన వాదనలను రుజువు చేసే బలమైన ఆధారాలను సమర్పించలేకపోయిందని తప్పుపట్టింది. దీంతో పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించిన కమిషన్.. హెచ్‌ఎస్‌బీసీ ఎర్గో సంస్థకు కింది ఆదేశాలు జారీ చేసింది. 
 

* పాలసీ మొత్తం కింద నామినీకి రూ.కోటి చెల్లించాలి.

* పిటిషన్ దాఖలు చేసిన తేదీ నుంచి రియలైజేషన్ వరకు దీనిపై 9% వార్షిక వడ్డీ వర్తిస్తుంది.

* మానసిక వేదనకు గురిచేసినందుకు గాను రూ.25వేలు పరిహారం.

* కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.10వేలు చెల్లించాలని ఆదేశించింది.

అలాగే ఈ ఆదేశాలను తీర్పు వెలువడిన 45 రోజుల్లోగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.