July 23, 2026

ఓరీ దేవుడో ఇవేం ఎండలురా సామీ.. ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు

ఓరీ దేవుడో ఇవేం ఎండలురా సామీ.. ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు
Reading Time: 2 minutes
ఓరీ దేవుడో ఇవేం ఎండలురా సామీ.. ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు

ఎడారి ఓడలుగా పిలువబడే ఒంటెలు తీవ్రమైన వేడిని తట్టుకోగలవని మనకు తెలుసు. కానీ, ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో నమోదవుతున్న 50 డిగ్రీల సెల్సియస్ దాటిన తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల ఈ మూగజీవాలు కూడా తట్టుకోలేక అల్లాడిపోతున్నాయి. భానుడి భగభగలకు ఎడారిలోని ఇసుక బాణలిలా కాగిపోతోంది. సాధారణంగా ఒంటెల పాదాల కింద మందపాటి చర్మ పొర ఉంటుంది. ఇది వేడి ఇసుకపై నడవడానికి సహాయపడుతుంది. కానీ, ఇప్పటి తీవ్రమైన ఉష్ణోగ్రతల ముందు ఆ చర్మం కూడా తట్టుకోలేకపోతోంది.

కాళ్లకు బొబ్బలు.. చర్మం కాలిపోతుంది.. నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు:

ఈశాన్య ఇథియోపియాలోని అఫార్ ప్రాంతంలో 500 ఒంటెల సంరక్షకుడైన 40 ఏళ్ల అలీ ఒమర్, తన కష్టాలను వివరించాడు. కాగిపోతున్న ఇసుకపై నడవడం వల్ల ఒంటెల పాదాలు కాలిపోయి పెద్ద ఎత్తున బొబ్బలు వస్తున్నాయి. నడిచేటప్పుడు తీవ్రమైన నొప్పితో అవి విలవిలలాడిపోతున్నాయి. కళ్ల నుండి నీరు కారుతోందని, చర్మం మండిపోతోందని, వెంట్రుకలు రాలిపోతున్నాయని అతను చెప్పాడు. వేడి తాకిడికి తోడు తీవ్ర నిర్జలీకరణం కారణంగా అనేక ఒంటెలు సగం దూరంలోనే ఇసుకపై కుప్పకూలిపోతున్నాయి. గత నెలలోనే ఈ తీవ్రమైన వేడికి అతను తన ఎనిమిది ఒంటె పిల్లలను కోల్పోయాడు. స్థానిక వ్యాపారులు, పశువుల కాపరులు కూడా ఈ తీవ్ర వేడికి తమ ఒంటెలను కాపాడుకోలేక చేతులెత్తేస్తున్నారు.

పర్యావరణవేత్తల ఆందోళన:

ఏ జీవులైతే ఎడారి వాతావరణానికి అనుకూలంగా పరిణామం చెందాయో, ఆ జీవులే ఈ రోజు వేడికి విలవిలలాడటం ప్రకృతి విపత్తుకు పరాకాష్ట అని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటెలు సాధారణంగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను సులభంగా తట్టుకోగలవు. అయితే, సహారా ఎడారిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటి, పగలు, రాత్రి 41 నుండి 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, అది నేరుగా ఒంటె కణాలపై దాడి చేస్తుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) శాస్త్రవేత్త డాక్టర్ మొహమ్మద్ బెంగౌమి, అల్జీరియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అబ్దుల్మజీద్ చెహ్మా వివరించారు.

 

 

View this post on Instagram

 

A post shared by TheBrainMaze (@thebrainmaze)

ఇది ఒంటెల తెల్ల రక్త కణాలను, రోగనిరోధక వ్యవస్థలను దెబ్బతీస్తుంది. వాటి జీవక్రియ మందగిస్తుంది. అవి తినడం మానేస్తాయి, అనారోగ్యానికి గురై చనిపోతాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) నివేదిక ప్రకారం, 1991 నుండి 2025 మధ్య ఉత్తర ఆఫ్రికాలో ప్రతి దశాబ్దానికి ఉష్ణోగ్రతలు 0.43 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. దీంతో ఈ అలుపెరుగని జీవి వాతావరణ మార్పుకు బాధితురాలిగా మారింది. భూతాపం ఇలాగే పెరిగితే రాబోయే రోజుల్లో ఎడారి జీవుల ఉనికి కేవలం కథలకే పరిమితమవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ ఘటనలు మరొకసారి హెచ్చరిస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..