Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!

Punya Kshetra Yatra: ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే భక్తులకు భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. “అయోధ్య-కాశీ: పుణ్యక్షేత్ర యాత్ర” పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఆగస్టు 4, 2026 నుంచి నడపనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర 9 రాత్రులు – 10 రోజుల ప్యాకేజీలో పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ఆరు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
ఈ టూర్‌లో మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్లీపర్ (SL) – 237, 3AC – 416, 2AC – 52 సీట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక రైలు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటుంది.
ఈ యాత్రలో భక్తులు పూరీలో శ్రీ జగన్నాథ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయం, గయాలో విష్ణుపాద ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయం, గంగా హారతి, అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్‌గఢీ, సరయూ నది హారతి, అలాగే ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేసే అవకాశం పొందుతారు.
ఆగస్టు 4న సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు ఆగస్టు 5న పూరీ చేరుకుంటుంది. అక్కడ జగన్నాథ ఆలయ దర్శనం అనంతరం మరుసటి రోజు కోణార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత గయాలో విష్ణుపాద ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, గంగా హారతి, అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్‌గఢీ, సరయూ హారతి, చివరగా ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం సందర్శించిన అనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆగస్టు 13న సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు:
ఈ యాత్రకు మూడు విభాగాల్లో బుకింగ్ అవకాశం ఉంది.
* ఎకానమీ (స్లీపర్) – రూ.16,500
* స్టాండర్డ్ (3AC) – రూ.25,600
* కంఫర్ట్ (2AC) – రూ.33,400
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక రాయితీ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ధరల్లో ఇప్పటికే GSTతో పాటు భారత్ గౌరవ్ పథకం కింద భారతీయ రైల్వే అందిస్తున్న సుమారు 33% రాయితీ కూడా కలిపి ఉంటుంది.
ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి?
ఈ టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, అవసరమైన చోట వాష్ అండ్ చేంజ్ సదుపాయం, స్థానిక రవాణా, ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం (శాకాహారం మాత్రమే), ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ మేనేజర్ సేవలు, రైలులో భద్రత, వర్తించే పన్నులు అన్నీ ఉంటాయి. అయితే ఆలయాలు లేదా ఇతర ప్రదేశాల ప్రవేశ రుసుములు, వ్యక్తిగత ఖర్చులు, రూమ్ సర్వీస్ వంటి సేవలు ప్యాకేజీలో ఉండవు.
యాత్రకు వెళ్లే ప్రయాణికులు ఆధార్ లేదా ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ముందుగానే వైద్యుల సలహా తీసుకోవాలని IRCTC సూచించింది. రైల్లో ధూమపానం, మద్యం సేవించడం నిషేధం. ప్రయాణ సమయాలు రైళ్ల రన్నింగ్ పరిస్థితులను బట్టి మారే అవకాశం ఉన్నందున తదనుగుణంగా ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG64 ఈ పేజీని చూడండి.