
పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మే 9న ఉదయం 7 గంటల నుంచి చండీగఢ్‌లోని ఆయన నివాసంతో పాటు ఢిల్లీ, గురుగ్రామ్‌లలో ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఈడీ.. మంత్రిని అదుపులోకి తీసుకుంది.
రూ. 100 కోట్లకు పైగా విలువైన మొబైల్ ఫోన్ల నకిలీ జీఎస్టీ కొనుగోళ్లు.. ఆపై దుబాయ్ నుంచి అక్రమ నిధులను భారత్‌కు తరలించినట్లు ఈడీ కీలక ఆరోపణలు చేస్తోంది. కేవలం బిల్లులు సృష్టించి మోసపూరిత ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేశారని.. దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 157 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఏజెన్సీ.. ఇప్పుడు మంత్రి అరెస్టుతో దర్యాప్తును వేగవంతం చేసింది.
►ALSO READ | కేరళకు వెళ్లనున్న తమిళనాడు గవర్నర్ : ఈలోపు విజయ్ కలుస్తారా లేదా..?
మంత్రి అరెస్టుపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మీరు అరెస్టు చేసిన వారు నాలుగు రోజుల్లో బయటకు వస్తారు.. కానీ ఈ చర్యతో రాబోయే 20 ఏళ్ల పాటు బీజేపీ పంజాబ్‌లో అడుగుపెట్టలేదు అంటూ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. కేంద్రం ఏజెన్సీలను ఆయుధాలుగా వాడుతోందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం మండిపడ్డారు.