Reading Time: < 1 minute
Acb Raids Rb Enc Mohan Naik Properties Searches Conducted At 11 Locations Over Disproportionate Assets Case

ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్అండ్‌బీ) ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్‌లోని ఆయన నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మోహన్ నాయక్ ఈఎన్‌సీ హోదాలో ఉన్న సమయంలో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో మొత్తం 11 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టారు.

మియాపూర్‌ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లా నంబర్-98లో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా అధికారుల అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు మోహన్ నాయక్‌పై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించే ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి లెక్కలు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువపై అధికారిక వివరాలు వెల్లడించాల్సి ఉంది. సాయంత్రం వరకు ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయిన అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ వెల్లడించనున్నారు.