
- వరంగల్ జిల్లాలో బంగారం, డబ్బుతో ఉడాయించిన భార్య, భర్త ఆత్మహత్యాయత్నం
ముత్తారం, వెలుగు : భార్య మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో జరిగింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన బండి రాజు(35)కు ఎనిమిదేండ్ల కింద ఆసిఫాబాద్‌కు చెందిన శారదతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. శారదకు కొన్ని రోజుల కింద సింగరేణి ఉద్యోగి మండల రమేశ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం రాజుకు తెలియడంతో భార్యను మందలించినా ఆమె పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే శారద రమేశ్‌తో కలిసి ఆసిఫాబాద్‌లో ఉంటోంది.
కొన్ని రోజుల కింద రాజు, అతడి కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ వెళ్లి శారద, రమేశ్‌ను పట్టుకొని చితకబాదారు. అయినా శారద ప్రవర్తన మారకపోవడంతో మనస్తాపానికి గురైన రాజు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు.. రాజు డెడ్‌బాడీతో రమేశ్ ఇంటి ఎదుట బైఠాయించారు.
శారద, రమేశ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సీఐ రాజు, ముత్తారం, రామగిరి ఎస్సైలు రాజ్‌కుమార్, శ్రీనివాస్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, మృతుడి ఫ్యామిలీకి నిందితులు రూ. 25 లక్షలు గానీ, ఎకరం భూమి గానీ ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు చర్చ నడుస్తోంది.
వరంగల్ జిల్లాలో…
పర్వతగిరి: ఓ మహిళ బంగారం, డబ్బు తీసుకొని పారిపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన పుట్ట నరేశ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. గీసుగొండ మండలం మునుగొండ గ్రామానికి చెందిన గుల్లపల్లి గాయత్రి అలియాస్ పల్లవితో మార్చి 15న వివాహమైంది.
ఈ నెల 6న నరేశ్ పని కోసం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో గాయత్రి ఇంట్లో ఉన్న బట్టలు, డ్రెస్సింగ్ టేబుల్, బీరువా, 4 తులాల బంగారు ఆభరణాలు, డబ్బు తీసుకొని పరార్ అయింది. పని ముగించుకొని ఇంటికి వచ్చిన నరేశ్.. విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య పారిపోయిందన్న అవమానం భారం తట్టుకోలేక ఆదివారం పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. నరేశ్ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.