
దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశంలోనే అత్యధిక కాలం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును మోదీ అధిగమించారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధానిగా మోదీ సాధించిన అసాధారణ విజయాలు, ఆయన పనితీరుపై భారత మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. మోదీ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం ఆయన నిరంతర ఆలోచనా విధానం, జాతీయ ప్రయోజనాల విషయంలో ఆయన చూపే చెదిరిపోని నిబద్ధత అని దేవెగౌడ కొనియాడారు. నెహ్రూ కాలానికి, నేటి మోదీ కాలానికి మధ్య ఉన్న రాజకీయ వ్యత్యాసాలను దేవెగౌడ గణాంకాలతో సహా వివరించారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ నైతిక మద్దతుతో ఎటువంటి రాజకీయ పోటీ లేని కాలంలో నెహ్రూ తొలి ప్రధాని అయ్యారు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కేవలం 53 పార్టీలు మాత్రమే పోటీ పడ్డాయి. ఓటర్ల సంఖ్య 17 కోట్లు. కానీ 2024 ఎన్నికల నాటికి పోటీ పడిన పార్టీల సంఖ్య 2,593 కి చేరింది. నేడు దేశ ఓటర్ల సంఖ్య ఏకంగా 146 కోట్లకు పైమాటే. నేను ‘‘1996లో ప్రధాని అయిన కాలానికే రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నెహ్రూ-గాంధీ కుటుంబం వెలుపల ఉన్న మా లాంటి ప్రధానులకు ఎటువంటి గాడ్ ఫాదర్లు, సామాజిక అండదండలు లేవు. అలాంటిది ఎటువంటి అలసట లేకుండా దేశాన్ని నడిపిస్తూ మోదీ మూడోసారి ప్రధాని కావడం ఒక అద్భుతం” అని దేవెగౌడ పేర్కొన్నారు.
నెహ్రూ కేబినెట్ వర్సెస్ మోదీ కేబినెట్
నెహ్రూ హయాంలోని కేబినెట్ కంటే మోదీ కేబినెట్ ఎంతో వైవిధ్యమైనదని దేవెగౌడ విశ్లేషించారు. నెహ్రూ తన మూడో విడత పాలనలో కూడా కేబినెట్‌లో కేవలం అగ్రవర్ణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలనే కాకా కలేల్కర్ కమిషన్ నివేదికను కూడా నెహ్రూ తిరస్కరించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత మోదీ కేబినెట్ భారత సామాజిక వైవిధ్యానికి అద్దం పడుతోందని ప్రశంసించారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, 5 గురు ఎస్టీ మంత్రులు ఉన్నారని తెలిపారు. మహిళా బిల్లును ఆమోదింపజేయడమే కాకుండా మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడానికి పార్లమెంట్‌ను విస్తరించేందుకు మోదీ తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
సామాజిక మాధ్యమాల స్కృటినీని తట్టుకుంటూ..
హ్రూ కాలంలో కేవలం అరడజను వార్తాపత్రికలు మాత్రమే ఉండేవని, టెలివిజన్ మీడియా లేదా విమర్శలు ఉండేవి కావని దేవెగౌడ అన్నారు. కానీ నేడు 24 గంటల మీడియా, సోషల్ మీడియాల వల్ల మోదీ ప్రతి సెకనుకూ లక్షలాది మంది స్కృటినీని ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఈ విమర్శలు చాలా వ్యక్తిగతంగా, కఠినంగా ఉన్నప్పటికీ మోదీ వాటన్నింటినీ తట్టుకుంటూ దేశాన్ని నడుపుతున్నారని కొనియాడారు.
వరల్డ్ క్లాస్ లీడర్.. మన్ కీ బాత్ కనెక్టివిటీ..
లిటరీ పరమైన వివాదాలు వచ్చినప్పుడు మోదీ తీసుకునే దృఢమైన నిర్ణయాలు, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందేలా మార్చడం వంటివి మోదీ లీడర్‌షిప్‌కు నిదర్శనమని దేవేగౌడ అన్నారు. ‘‘నేను మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అస్సలు మిస్ అవ్వను. ఆయన టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఒక్క పౌరుడికి చేరువవుతున్నారు. ప్రజల నుంచి వచ్చే విమర్శలను స్వీకరిస్తూ, నిరంతరం ఆలోచిస్తూ ముందుకు సాగడమే మోదీ విజయ రహస్యం” అని దేవెగౌడ తన వ్యాసంలో ముగించారు.