Reading Time: < 1 minute
Pok Protests Pak Army Firing Casualties Long March

POK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో పాకిస్తాన్ ఆర్మీ దాష్టీకాలకు తెగబడుతోంది. హక్కుల కోసం ఆందోళన చేస్తున్న నిరసనకారులపై కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 30 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మరణాల సంఖ్య 100ను దాటినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నిర్వహించిన “ముజఫరాబాద్‌కు లాంగ్ మార్చ్” సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి, పాకిస్థాన్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిరసనకారులు , భద్రతా సిబ్బందితో తలపడ్డారు. ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీప్ జనరల్ అసిమ్ మునీర్‌కు, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అసిమ్ మునీర్ ఒక ఉగ్రవాది, ఐఎస్ఐ ఒక ఉగ్రవాది’’ అంటూ ప్రజలు నినదించారు. నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలో పీఓకే అంతటా పాక్ ఆర్మీ మోహరించింది.

మరోవైపు, అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు ఖ్వాజా మెహ్రాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ‘‘ఈ రోజును లిఖించుకోండి మరియు భవిష్యత్ తరాలకు చెప్పండి, మనం వారి పారామిలిటరీ దళాలకు తలవంచకుండా నిలబడ్డామని, వారికి భయపడలేదని’’ అని అన్నారు. నిరసనల్లో ప్రజలు చేరాలని రావల్కోట్ ప్రాంతంలోని పలు మసీదుల నుంచి ప్రకటనలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ భూభాగంపై విదేశీ శక్తులు దాడి చేశాయని, కాశ్మీరీలందరూ సుదీర్ఘ పాదయాత్రలో పాల్గొని తమ జాతీయ గౌరవాన్ని ప్రదర్శించాలని ప్రకటనల్లో చెపపారు.