
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి సంస్థలో 12 ఏండ్ల కాలానికి సంబంధించి ఆదాయవ్యయాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివవరావు డిమాండ్ చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌లో నిర్వహించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కమిటీ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కూనంనేని మీడియాతో మాట్లాడారు. నాణ్యత పేరుతో సింగరేణి మనుగడపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉత్పత్తి, ఆదాయాన్ని పెంచే మార్గాలను వదిలిపెట్టి.. సంస్థను దోచుకునే పనిలో పడ్డారన్నారు. కంపెనీ నష్టాల్లో నడుస్తుందని చెప్పే నాయకులు.. ఎవరి వల్ల నష్టాలు వచ్చాయే కూడా చెప్పాలని సవాల్ చేశారు. కార్మికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. సమావేశంలో వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కె. రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, నేతలు కె. సారయ్య, కె.వీరభద్రయ్య, మద్ది ఎల్లయ్య, వైవీ.రావు, వంగా వెంకట్ పాల్గొన్నారు.