Reading Time: 2 minutes
Moral Story: మూడు చిలుకలు కథ.. కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది

Moral Story in Telugu: నీతి కథలు పిల్లలు, పెద్దలకు నైతిక విలువలు నేర్పుతాయి. దీంతో పాటు మంచి అలవాట్లు, సరైన ఆలోచనా విధానాన్ని అలవరచుకునేందుకు దోహదపడుతాయి. చిన్నతనంలో చదివే నీతి కథలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. సోమరితనంతో కలిగే అనర్థాల గురించి మూడు చిలుకల నీతి కథ వివరిస్తుంది. ఆ కథను ఇప్పుడు మనం కూడా చదివేద్దాం.

కథ

ఒక అందమైన అడవిలో మూడు చిలుకలు ఉండేవి. అవి ఎప్పుడూ కలిసి తిరిగేవి. వాటి మధ్య ఎలాంటి గొడవలు లేవు. స్నేహం చాలా బలంగా ఉండేది. ఒక రోజు మొదటి చిలుక ఇలా అంది.. “మనకు వాన నుండి, ఎండ నుండి రక్షణ కావాలి. అందరం కలిసి ఒక మంచి గూడు కట్టుకుందాం.”

రెండవ చిలుక మాత్రం అలసత్వంగా ఉండేది. అది ఇలా అంది.. “ఇప్పుడు మనకు గూడు అవసరం లేదు. హాయిగా ఎగురుదాం, పాడుదాం.” మూడవ చిలుక మాత్రం తక్షణమే చిన్న గూడు కట్టుకుంది. అది తేలికగా ఉండే ఆకులు, తీగలతో ఒక చిన్న ఆశ్రయం తయారు చేసింది.

మొదటి చిలుక మాత్రం ఓపికగా పని చేసింది. అది రోజూ అడవిలో తిరిగి బలమైన తీగలు, మంచి ఆకులు సేకరించింది. కొన్ని రోజులు శ్రమించి అది చాలా బలమైన గూడు నిర్మించింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఒక రోజు అకస్మాత్తుగా పెద్ద గాలి వాన వచ్చింది. గాలి చాలా బలంగా వీచింది. రెండవ చిలుకకు గూడు లేకపోవడంతో అది చాలా ఇబ్బంది పడింది. మూడవ చిలుక కట్టుకున్న చిన్న గూడు గాలికి ఎగిరిపోయింది. రెండు చిలుకలు భయంతో అడవిలో తిరిగాయి.

ఈ విషయం మొదటి చిలుకకు తెలిసింది. అప్పుడు మొదటి చిలుక అటవిలో తిరిగి..రెండో చిలుక, మూడో చిలుకను తాను బలంగా కట్టుకున్న గూటికి తీసుకువెళ్ళింది. ఆ గూడు గాలి వానలో కూడా కదలలేదు. మూడు చిలుకలు అక్కడ సురక్షితంగా ఆశ్రయం పొందాయి. కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుందని రెండో చిలుక, మూడో చిలుక గ్రహించాయి.

నీతి

ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ముందుచూపుతో ఆలోచించి సమయం ఉన్నప్పుడే పని పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం. సోమరితనం మనకు నష్టం చేస్తుంది. కష్టపడి, ఓపికతో చేసే పని ఎప్పుడైనా మనకు రక్షణగా ఉంటుంది. ప్రమాదంలో ఉన్న స్నేహితుడిని ఆదుకోవాలన్న సందేశం కూడా ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది.

ఇది కూడా చదవండి: తెలివైన కుందేలు నీతి కథ.. ఉపాయంతో అపాయాన్ని జయించండి..!