Reading Time: < 1 minute
Hyderabad Ganja Party Busted Ayurvedic Doctor Among 8 Detained In Chandrayangutta Raid

Ganja Party Busted: హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చంద్రాయణగుట్ట బండ్లగూడ ప్రాంతంలో గంజాయి పార్టీ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. క్రిస్టల్ టౌన్‌షిప్‌లోని ఓ నివాస గృహంపై ప్రత్యేక బృందాలు ఆకస్మికంగా దాడులు నిర్వహించి గంజాయి వినియోగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నాయి.

రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో.. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ అతావుల్లా ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి పార్టీ నిర్వహిస్తున్న సమయంలో డాక్టర్ అతావుల్లాతో పాటు గంజాయి సేవిస్తున్న మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల సందర్భంగా నిందితుల వద్ద నుంచి సుమారు 220 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని వైద్య పరీక్షల కోసం పంపించారు. మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం, సరఫరాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.