
- ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
పద్మారావునగర్, వెలుగు : నమ్మించి తీసుకెళ్లి ఇద్దరు యువకులు కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. సికింద్రాబాద్ పరిధిలో వారం కింద జరిగిన హత్య కేసు మిస్టరీని లాలాగూడ పోలీసులు చేధించారు. కేసుకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లా సల్హే గ్రామానికి చెందిన జై ప్రకాశ్ దేశ్‌ముఖ్ (38) హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తాపీ మేస్త్రీగా పనిచేస్తూ నిర్మాణ స్థలాల్లోనే నివసించేవాడు. ఈ నెల 2న కాజీపేటలో పని ముగించుకుని సికింద్రాబాద్ చేరుకున్న అతడు మియాపూర్‌లోని తన సోదరుడి వద్దకు వెళ్లేందుకు మోండా మార్కెట్ ప్రాంతంలో వేచి ఉన్నాడు. తుకారాంగేట్‌కు చెందిన డెలివరీ బాయ్ ధాబీ వినోద్ (30), అడ్డగుట్టకు చెందిన మరో డెలివరీ బాయ్ మక్కల మోహన్ (19) ఒంటరిగా ఉన్న ప్రకాశ్‌ను గుర్తించి రైల్వే స్టేషన్‌లో దించుతామని తమ బైక్ ఎక్కించుకున్నారు. తూకారాం గేట్ రైల్వే బ్రిడ్జి బైపాస్ రోడ్డు వద్ద నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి వచ్చిన అనంతరం ప్రకాశ్ వద్ద ఉన్న మొబైల్, డబ్బు లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రకాశ్ అడ్డుకోవడంతో నిందితులు పక్కనే బండరాళ్లతో ప్రకాశ్ తలపై మోది హత్య చేశారు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ. 110, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. 3న తెల్లవారుజామున డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లాలాగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో నాలుగు టీమ్స్‌ను ఏర్పాటు చేసి గాలింపు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు సోమవారం తెల్లవారుజామున ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ గతంలో ఒకే దుకాణంలో పనిచేయడంతో పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ కలిసి రాత్రి పూట ఒంటరిగా వెళ్లే వారిని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని డీసీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ కె. శశాంక్‌రెడ్డి, లాలాగూడ ఎస్‌హెచ్‌ఓ టి. అశోక్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, డీఐ ఎల్. మధుబాబును ఉన్నతాధికారులు అభినందించారు.