
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. సోమవారం రాత్రి 9గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ మొత్తం 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. వీటిలో లక్షా 40 వేల కొరమిను చేప పిల్లలు కావడం గమనార్హం. అవసరాలకు అనుగుణంగా చేప పిల్లలు తెచ్చేలా ప్లాన్ చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయానికి 50 వేలకు పైగా చేప మందు తీసుకున్నట్లు అంచనా.
రెండు రోజుల ముందు నుంచే చేప ప్రసాదం కోసం ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఒడిశా, యూపీ, బీహార్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. సుమారు 3 లక్షలకు పైగా ప్రసాదం తీసుకొవడానికి వస్తారనే అంచనాతో అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ముందుకెళ్తున్నారు. వీటితో పాటు వీఐపీ, వికలాంగులకు, వృద్ధులకు.. స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు.
మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు వందల ఏండ్ల నుంచి అందజేస్తున్న చేప మందు ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సోమవారం రాత్రి 8:45 గంటలకు ప్రారంభమైంది. బత్తిని కుటుంబసభ్యులతో పాటు మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కలెక్టర్ ప్రియాంక ఆల ప్రసాద పంపిణీని ప్రారంభించారు.
అంతకుముందు దూద్‌బౌలీలోని బత్తిని ఇంట్లో బత్తిని గౌరీ శంకర్, దుర్గా శంకర్, సౌమ్య మృగశిర కార్తె పూజలు చేశారు. అనంతరం ఆచారం ప్రకారం 11 మందికి చేపమందు వేసి, నాంపల్లి ఎగ్జిబిషన్ భారీ పోలీసు బందోబస్తు మధ్య చేపమందు తరలించారు. ప్రతి ఏటా మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఆస్తమా బాధితులు తరలివచ్చారు.
గ్రౌండ్స్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద 16 కౌంటర్లలో టోకెన్లు జారీ చేశారు. రాత్రి 7 గంటల వరకు సుమారు 50 వేల మంది టోకెన్లు పొందినట్లు అధికారులు తెలిపారు. 35 కౌంటర్లలో ప్రసాదం పంపిణీ జరుగుతుండగా, వీఐపీల కోసం 4 కౌంటర్లను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి వరకే సుమారు 30 వేల మంది క్యూలో ఉన్నారు.
మంగళవారం జనాలు రెట్టింపయ్యే అవకాశం ఉండడంతో ఈసారి మత్స్యశాఖ రెండు లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. ఒక్కో చేప పిల్లను రూ.40 ధరకు అందుబాటులో ఉంచారు. బత్తిని సోదరులతో పాటు వారి కుటుంబ సభ్యులు 250 మంది చేపప్రసాదం పంపిణీలో పాల్గొంటున్నారు. బుధవారం నుంచి బత్తిని ఇంటి వద్ద 3 రోజుల పాటు ప్రసాదం పంపిణీ చేయనున్నారు.