Reading Time: < 1 minute
Telangana: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ మండే.. ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్ సభలు..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. హాట్ సమ్మర్‌లో అంతే హాట్‌గా సాగుతున్న పాలిటిక్స్.. సోమవారం జరిగే ముఖ్యనేతల సమావేశాలతో మరింత హీటెక్కే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. ఒకే రోజు రెండు వేర్వేరు సభల్లో పాల్గొనబోతున్నారు. అయితే, ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మ.3గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం రేవంత్.. ముందుగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4:20కి మేడిగడ్డకు చేరుకోనున్న సీఎం.. మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శిస్తారు. అక్కడే ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి.. ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులపై చర్చిస్తారు. ఆ తరువాత కాటారం మండలం నస్తూర్‌పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్.. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. తన పర్యటనలో సీఎం రేవంత్.. కేసీఆర్, బీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అంశంలోనే గులాబీ బాస్‌ను రేవంత్ టార్గెట్ చేయొచ్చనే చర్చ జరుగుతోంది.

ఏడాది తరువాత జనంలోకి వస్తున్న కేసీఆర్..

రేవంత్ టూర్ ఇలా ఉంటే.. దాదాపు ఏడాది తరువాత మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. గతేడాది బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఆ తరువాత మళ్లీ జనంలోకి రాలేదు. మాజీమంత్రి జీవన్ రెడ్డి చేరిక సభ కోసం జగిత్యాలకు వస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ రకమైన విమర్శలు చేస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం పదవీకాలం సగం పూర్తికావడంతో… ఇక కేసీఆర్ జనంలోనే ఉంటారని బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది.

దీంతో ఇప్పటి నుంచే రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ పెంచేలా కేసీఆర్ ప్రసంగం ఉంటుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌తోపాటు తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా మారుతున్న బీజేపీని కూడా కేసీఆర్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. అటు సీఎం రేవంత్, ఇటు కేసీఆర్ తమ ప్రసంగాల్లో మాటల దాడి పెంచితే.. రాజకీయం మరో లెవెల్‌కి వెళ్లడం ఖాయం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..