Reading Time: < 1 minute
19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. ఎవరికీ సాధ్యంకాని రికార్డులో ఆర్ఆర్ సంచలనం..!

Jofra Archer Record: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 28వ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆర్చర్ నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే కోల్‌కతా ఓపెనర్ టిమ్ సీఫెర్ట్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఈ వికెట్‌తో ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధిక వికెట్లు (5 సార్లు) తీసిన బౌలర్‌గా మొహమ్మద్ షమీ రికార్డును ఆర్చర్ సమం చేశాడు. గతంలో పృథ్వీ షా, ప్రియాంశ్ ఆర్య, ఫిల్ సాల్ట్, అభిషేక్ శర్మ వంటి మేటి ఆటగాళ్లను ఆర్చర్ ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుట్ చేయడం విశేషం.

హ్యాట్రిక్ ఘనత సాధించిన ఏకైక బౌలర్..

ఈ సీజన్‌లో ఆర్చర్ ప్రదర్శన కేవలం గణాంకాలకే పరిమితం కాలేదు. గత పది రోజుల్లో జరిగిన మూడు వరుస మ్యాచ్‌ల్లోనూ (బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాపై) ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసి ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మొదటి బంతికే వికెట్ పడగొట్టిన ఏకైక బౌలర్‌గా ఆర్చర్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ట్రెండ్ బౌల్ట్, ఉమేష్ యాదవ్, లసిత్ మలింగ వంటి దిగ్గజాలు కూడా ఈ మైలురాయికి చేరువలో లేరు.

మ్యాచ్ సాగిందిలా..

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (46), యశస్వి జైస్వాల్ (39) మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా, మిగిలిన బ్యాటర్లు విఫలమవ్వడంతో స్కోరు నెమ్మదించింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా, కార్తీక్ త్యాగి కూడా మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను కట్టడి చేశారు. అయితే, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాను ఆర్చర్ తన తొలి బంతి వికెట్‌తో కోలుకోలేని దెబ్బ తీశాడు.

తొలి బంతికే వికెట్లు తీసిన టాప్ బౌలర్లు (జాబితా):

జోఫ్రా ఆర్చర్: 5 వికెట్లు

మొహమ్మద్ షమీ: 5 వికెట్లు

ట్రెంట్ బౌల్ట్: 3 వికెట్లు

ఉమేష్ యాదవ్: 3 వికెట్లు

లసిత్ మలింగ: 3 వికెట్లు

ప్రస్తుతం ఆర్చర్ తన వేగంతో, ఖచ్చితత్వంతో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన బలవనంగా మారాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..