Reading Time: 2 minutes
ఏసీ కూలింగ్ తగ్గిందని మెకానిక్‌ను పిలుస్తున్నారా..? ఈ నిజాలు తెలుసుకోకపోతే జేబుకు చిల్లే..

ఎండలు మండిపోతున్నాయి.. భానుడి భగభగలకు ఇళ్లు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. దీంతో ఏసీల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే.. ఏసీ ఆన్ చేసినా గది చల్లబడకపోవడం. ఇలాంటప్పుడు టెక్నీషియన్లను పిలిస్తే.. చాలామంది గ్యాస్ లీక్ అయ్యింది.. రీఫిల్ చేయాలి అని వేలల్లో బిల్లు వేస్తుంటారు. అసలు మీ ఏసీలో గ్యాస్ ఎందుకు తగ్గుతుంది..? గ్యాస్ నింపడానికి ఎంత ఖర్చవుతుంది..? మీరు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

కూలింగ్ తగ్గడానికి ప్రధాన కారణాలు:

ఏసీ పాతబడే కొద్దీ దాని సామర్థ్యం తగ్గడం సహజం. కానీ ఈ కింది కారణాల వల్ల కూలింగ్ త్వరగా తగ్గిపోతుంది.ఫిల్టర్లలో ధూళి పేరుకుపోతే గాలి రాక తగ్గి, ఏసీ ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఏసీని సీజన్ ప్రారంభంలో సర్వీసింగ్ చేయించకపోతే కాయిల్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. మోటార్ లేదా కంప్రెసర్ సరిగ్గా పనిచేయకపోయినా గది చల్లబడదు. పైవన్నీ బాగున్నప్పటికీ కూలింగ్ రావడం లేదంటే 90శాతం అది గ్యాస్ లీక్ సమస్యే.

ఏసీలో వాడే గ్యాస్ రకాలు:

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏసీలలో ప్రధానంగా మూడు రకాల గ్యాస్‌లను ఉపయోగిస్తున్నారు. మీ ఏసీ మోడల్‌ను బట్టి ఏ గ్యాస్ వాడాలో టెక్నీషియన్‌ను అడిగి తెలుసుకోండి.

  • R22: ఇది పాత మోడల్ ఏసీలలో ఎక్కువగా ఉంటుంది.
  • R410A: గత కొన్ని ఏళ్ల క్రితం వచ్చిన ఏసీలలో దీనిని వాడతారు.
  • R32: ప్రస్తుతం వస్తున్న లేటెస్ట్ ఇన్వర్టర్ ఏసీలలో దీనినే వాడుతున్నారు. ఇది పర్యావరణానికి తక్కువ హాని చేయడమే కాకుండా, తక్కువ విద్యుత్తును వాడుకుంటుంది.

గ్యాస్ రీఫిల్లింగ్‌కు అయ్యే ఖర్చు ఎంత?

సాధారణంగా 1.5 టన్నుల స్ప్లిట్ ఏసీలో 1.5 నుంచి 2 కిలోల గ్యాస్ పడుతుంది. దీని ధరలు ప్రాంతాన్ని బట్టి, వాడే గ్యాస్ నాణ్యతను బట్టి మారుతుంటాయి. 1.5 టన్నుల ఏసీకి గ్యాస్ నింపడానికి రూ.2,500 నుండి రూ.4,500 వరకు ఖర్చు కావచ్చు. టెక్నీషియన్ కేవలం గ్యాస్ నింపడమే కాకుండా లీకేజీ ఎక్కడ ఉందో కనుగొని దానిని రిపేర్ చేయాలి. లేకపోతే మళ్లీ నెల రోజుల్లోనే గ్యాస్ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది.

టెక్నీషియన్ల దగ్గర మోసపోకుండా ఉండాలంటే..

మీ ఏసీకి ఉన్న స్టిక్కర్ మీద ఏ గ్యాస్ వాడాలో రాసి ఉంటుంది, అది చూసి మాత్రమే గ్యాస్ నింపించండి.

  • గ్యాస్ నింపే ముందు లీక్ టెస్ట్ చేయమని అడగండి.
  • గ్యాస్ రీఫిల్లింగ్ ధరలను ఆన్‌లైన్ లేదా సర్వీస్ సెంటర్ల ద్వారా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.
  • వీలైతే నమ్మకమైన కంపెనీ టెక్నీషియన్లను లేదా గుర్తింపు పొందిన యాప్స్ ద్వారా సర్వీస్ బుక్ చేసుకోండి.