
ఆదాయపు పన్ను రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న టాక్స్ పేయర్స్ లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మీ రిఫండ్ ప్రాసెసింగ్ ఆగిపోయిందని, వెంటనే క్లెయిమ్ చేసుకోకపోతే పెనాల్టీ పడుతుందంటూ పంపిస్తున్న నకిలీ మెసేజ్ ల పట్ల ఆదాయపు పన్ను శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అసలైన నోటిఫికేషన్లను పోలి ఉండే ఈ సందేశాలు పన్ను చెల్లింపుదారులను తప్పుదోవ పట్టించి, వారి ఆర్థిక వివరాలను దొంగిలిస్తున్నాయని పన్ను అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మోసగాళ్లు ప్రధానంగా డియర్ టాక్స్‌పేయర్, మీ రిఫండ్ పెండింగ్‌లో ఉంది.. వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ నకిలీ వెబ్‌సైట్ లింక్‌లను ఎస్‌ఎమ్ఎస్ లేదా ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నారు. ఆ లింక్‌లను క్లిక్ చేయగానే అది ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్‌ను పోలి ఉండే వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. అక్కడ పాన్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, పుట్టిన తేదీ, ఫోన్‌కు వచ్చే OTPలను నమోదు చేయమని కోరుతారు. ఒక్కసారి ఈ వివరాలు అందిస్తే.. మీ ఖాతాలోని సొమ్మును క్షణాల్లో ఖాళీ చేసే ప్రమాదం ఉందని ఐటీ శాఖ హెచ్చరించింది.
KIND ATTENTION TAXPAYERS!
⚠️ Fake messages may claim a refund or urgent action and push you to click a link.🛑 Don’t fall for it — never share OTPs or bank details.
✅ Verify communications on the official portal (https://t.co/GYvO3mStKf)
✅ Report suspicious messages to… pic.twitter.com/2icUA3O8f5
— Income Tax India (@IncomeTaxIndia) February 16, 2026
సాధారణంగా ఈ నకిలీ సందేశాల్లో అర్జెంట్ యాక్షన్ రిక్వైర్డ్, క్లిక్ నౌ, పెనాల్టీ అలర్ట్ వంటి పదాలను వాడుతూ భయాందోళనలకు గురిచేస్తారు. పన్ను రిఫండ్ ఆలస్యమవుతుందన్న ఆందోళనలో ఉన్నవారు త్వరగా స్పందిస్తారనేది నేరగాళ్ల ఎత్తుగడ. అయితే ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ కూడా వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ అకౌంట్ డేటాను లేదా ఓటీపీలను ఎస్‌ఎమ్ఎస్ లేదా ఈమెయిల్ ద్వారా అడగదని స్పష్టం చేసింది. రిఫండ్ స్థితిని తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమాచారం అందించాలన్నా కేవలం అధికారిక వెబ్‌సైట్ www.incometax.gov.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.
పన్ను చెల్లింపుదారులు తమకు వచ్చే అనుమానాస్పద సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని ఐటీ శాఖ కోరుతోంది. ఒకవేళ ఎవరైనా ఇటువంటి మోసపూరిత సందేశాలను అందుకుంటే.. వెంటనే webmanager@incometax.gov.inకు సమాచారం ఇవ్వాలని.. అలాగే ఒక కాపీని incident@cert-in.org.in కు పంపాలని సూచించింది. అప్రమత్తత ఒక్కటే ఇటువంటి సైబర్ మోసాల నుండి రక్షణ కల్పిస్తుందని అధికారులు గుర్తు చేస్తున్నారు.