Reading Time: 2 minutes

T20 World Cup: సూపర్–8లో హై–వోల్టేజ్ మ్యాచ్లు.. గ్రూప్ 1 జట్లపైనే అందరి దృష్టి

Caption of Image.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్–8 దశ రేపటి ( ఫిబ్రవరి 21న) నుంచి ప్రారంభమవుతుంది. టోర్నమెంట్‌లోనే అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటాలకు  గ్రూప్–1 వేదికగా మారనుంది. ఈ గ్రూప్‌లో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా టీమ్స్ చోటు దక్కించుకున్నాయి. సెమీఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో నాలుగు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

భారత్: భారీ అంచనాలు..
ఆతిథ్య జట్టుగా భారత్ సూపర్–8లోకి అద్భుతమైన ప్రదర్శనతో అడుగు పెట్టింది. లీగ్ దశలో బయటపడిన బ్యాటింగ్ సమస్యలను సరిదిద్దుకోవాల్సిన అవసరం టీమిండియాకు ఉంది. బ్యాటర్ల దూకుడు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కలిగిన భారత జట్టుకు మిడిల్ ఆర్డర్ కీలకం కానుంది. సూపర్–8లో భారత్ తమ తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫలితమే గ్రూప్‌–1లో భారత్ ప్రయాణానికి బాటలు వేయనుంది.  

 సౌతాఫ్రికా: సమతుల్యంగా.. 
దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సమతుల్యంతో బరిలోకి దిగుతోంది. కీలక మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం వారికి పెద్ద బలం అని చెప్పాలి..  సూపర్–8లో భారత్‌తో జరిగే తొలి మ్యాచ్ కీలకంగా మారనుంది.  

వెస్టిండీస్: పవర్, ఫ్లేర్
టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ ఎప్పుడూ ప్రమాదకర జట్టే. భారీ షాట్లు ఆడే బ్యాటర్లు, దూకుడైన పేస్ దళం దాడితో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టగల సత్తా వారికి ఉంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు క్లిక్ అయ్యారంటే, డెత్ ఓవర్లలో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే.. ఈ గ్రూప్ నుంచి సెమీఫైనల్ చేరే బలమైన జట్టుగా మారే అవకాశం విండీస్ కు ఉంది.  

జింబాబ్వే: అండర్‌డాగ్ అయినా ప్రమాదమే..
ఐసీసీ వంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లలో అప్పుడప్పుడు జింబాబ్వే జట్టు మెరుపులు మెరిపిస్తోంది. బలమైన జట్లతో పోలిస్తే వీరికి మార్గం కఠినమైనదే అయినప్పటికీ, కీలక ప్లేయర్స్ ఒక్కసారిగా మ్యాచ్‌ను తిప్పగల సత్తా వీరికి ఉంది. కట్టుదిట్టమైన బౌలింగ్, అవకాశవాద బ్యాటింగ్‌తో సంచలనాలు సృష్టించడమే వారి వ్యూహంగా కనిపిస్తోంది.

గ్రూప్ సమీకరణలు

గ్రూప్ 1 నుంచి కేవలం రెండు జట్లకే సెమీఫైనల్ అవకాశం దక్కనుంది. అందువల్ల ప్రతి మ్యాచ్ కీలకం. నెట్ రన్‌రేట్ కూడా తుది ఫలితాలను ప్రభావితం చేసే అంశంగా మారే అవకాశం ఉంది. చిన్న విజయాలు, వ్యక్తిగత ప్రదర్శనలు కూడా ఎంతో కీలకమవుతాయి. గ్రూప్ 1 హై–వోల్టేజ్ క్రికెట్‌కు వేదికగా మారనుంది. బలమైన జట్లు, అండర్‌డాగ్ జట్లు అనే తేడా లేకుండా, ప్రతి జట్టు తమ ప్రపంచకప్ ట్రోఫీని దక్కించుకునేందుకు పోరాటం చేయనున్నాయి. దీంతో ఉత్కంఠభరితమైన ఈ గ్రూప్–1  మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులు వేచి ఉన్నారు.  
 

©️ VIL Media Pvt Ltd.