Reading Time: 2 minutes

Gaddar Film Awards: సినీ పరిశ్రమకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Caption of Image.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ (Gaddar Film Awards) వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్‌.. 

హైదరాబాద్‌ను కేవలం టాలీవుడ్‌కే పరిమితం చేయకుండా, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కేంద్ర బిందువుగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని భట్టి విక్రమార్క తెలిపారు. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసిందని వెల్లడించారు. ఇక్కడి వాతావరణం, సాంకేతిక నైపుణ్యం, అద్భుతమైన స్టూడియోలు ప్రపంచ స్థాయి చిత్రాలను నిర్మించడానికి అనుకూలంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. 

 గద్దర్ స్ఫూర్తితో అవార్డులు..

ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో అవార్డులను అందించడం వెనుక బలమైన కారణం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. కళ ద్వారా సమాజానికి సందేశాన్ని ఇచ్చి, ప్రజలను చైతన్య పరిచిన గద్దర్ స్ఫూర్తితో.. అర్థవంతమైన సినిమాలను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నప్పటికీ, సినీ పరిశ్రమపై తమకున్న ప్రత్యేక శ్రద్ధ పెట్టారని భట్టి విక్రమార్క  తెలియజేశారు. పరిశ్రమకు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుంది. ఉపాధి కల్పనలో, వాణిజ్య పరంగా సినీ రంగం ఎంతో కీలకం అని సిఎం తరఫున ఆయన హామీ ఇచ్చారు.

►ALSO READ | Rimi Sen: ‘ రియల్ ఎస్టేట్ స్టార్’గా చిరంజీవి హీరోయిన్.. దుబాయ్‍లో రిమీ సేన్ షాకింగ్ లైఫ్ స్టైల్!

మార్చి 19న మెగా ఈవెంట్

ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఈ అవార్డుల బాధ్యతను భుజాన వేసుకున్నారని భట్టి విక్రమార్క తెలిపారు.. సినీ రంగ అభివృద్ధికి ఆయన ఇచ్చే సలహాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోందని చెప్పారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ జ్యూరీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ, పారదర్శకంగా విజేతలను ఎంపిక చేయనున్నారు.  మార్చి 19న అత్యంత వైభవంగా ఈ ప్రదానోత్సవం జరగనుందని వెల్లడించారు. దేశమంతా హైదరాబాద్ వైపు చూసేలా ఈ వేడుకను నిర్వహించనున్నామని చెప్పారు.. సినీ పరిశ్రమ కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, వేలాది మందికి ఉపాధినిచ్చే కల్పవృక్షమని పేర్కొన్న భట్టి విక్రమార్క, గద్దర్ అవార్డుల ద్వారా ఉత్తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.