
ఈ యాక్సిడెంట్ ఫొటోలు చూస్తేనే గుండెలు ఆగుతున్నాయి.. అలాంటిది ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు పరిస్థితి ఏంటీ.. చావు అంచుల్లో ఆగిన ప్రాణాలు అన్న విషయం తెలిస్తేనే.. భగవంతుడా.. లేచిన వేళా విశేషం బాగుంది అనుకోక మానరు.. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు.. రోడ్డుపై వెళుతూ వెళుతూ అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఉన్న చాలా పెద్ద వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. అదృష్టమో ఏమో.. బస్సు మొత్తం అందులో పడలేదు. డ్రైవర్ అప్రమత్తతతో సగం బస్సు వ్యవసాయ బావిపైనే ఆగటంతో.. హమ్మయ్య అంటూ బస్సు నుంచి కిందకు దూకేశారు ప్రయాణికులు.. ఈ యాక్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ నుండి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఘటన చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో చోటుచేసుకుంది.
స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వైపు బయలుదేరిన ఆర్టీసీ బస్సు సుందరగిరి గ్రామ శివారులోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావి వైపునకు బస్సు దూసుకెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలతో కేకలు పెట్టారు. అయితే, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సు పూర్తిగా బావిలో పడిపోకుండా ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం ఏమీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.