
- ఓనర్, కస్టమర్ల మధ్య గొడవ.. ఇరువర్గాలపై కేసు
నారాయణగూడ, వెలుగు: నారాయణగూడలోని భట్టాడ్ కీ ఇడ్లీ రెస్టారెంట్లో.. బిల్లు విషయంలో కస్టమర్లు, యాజమాన్యం మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర వివాదానికి దారితీసింది. హిమాయత్‌నగర్‌కు చెందిన ఆశీష్ తన కుటుంబ సభ్యులు దాదాపు 30 మందితో కలిసి మంగళవారం రెస్టారెంట్‌కు వచ్చి.. సుమారు 4 గంటలపాటు టేబుళ్లను ఆక్రమించారు.
ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఖాళీ చేయమని యాజమాన్యం కోరగా, అదనంగా డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. వారు వెళ్లిపోయే సమయంలో బిల్లులో అదనంగా రూ.3 వేలు వేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్లింది. తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని రెస్టారెంట్ యజమాని యోగేశ్భట్టాడ్.. యాజమాన్యమే అకారణంగా దాడి చేసిందని కస్టమర్ ఆశీష్ నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేశామని, సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.