
- యుద్ధక్షేత్రాల్లో పరిష్కారాలు దొరకవ్
- చర్చలు, దౌత్యమే అసలైన మార్గాలు.. ఎస్‌సీవో సమిట్‌లో ప్రధాని మోదీ
- టెర్రరిజం పట్ల డబుల్ స్టాండర్డ్స్ ఉండొద్దంటూ పాక్‌కు చురకలు
- షెహబాజ్ షరీఫ్, షీ జిన్‌పింగ్ సమక్షంలోనే భారత్ వైఖరి వెల్లడి
- ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సిందేనని స్పష్టం
బిష్కెక్: యుద్ధభూమిలో ఏ సమస్యా పరిష్కారం కాదని, ఎలాంటి వివాదాలైనా దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కిర్గిస్తాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే మోదీ ఉగ్రవాద అంశంపై గట్టిగా గళమెత్తారు.
‘‘ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు ఏమాత్రం తావులేదని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో చాటిచెప్పాలి. ఉగ్రవాదానికి అందే నిధులు, నియామకాలు, తీవ్రవాద ప్రేరణ, సురక్షిత స్థావరాలు.. వీటన్నింటితో కూడిన వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది”అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద మద్దతు విధానాలను పరోక్షంగా ఎండగట్టారు.
సార్వభౌమత్వాన్ని గౌరవించాలి
రీజియనల్ కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలని, అయితే అవి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించినప్పుడే సాధ్యమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గుండా సాగుతున్న ‘చైనా––పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’ (సీపెక్) ప్రాజెక్టును ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ అనే 3 ప్రధాన సూత్రాలపై ఎస్‌సీవో కార్యాచరణ ఉండాలని, సభ్య దేశాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే అసలైన విజయమని ప్రధాని పేర్కొన్నారు. ‘‘డ్రగ్స్ అక్రమ రవాణా నేరం మాత్రమే కాదు. యువతకు, ప్రాంతీయ భద్రతకు ఒక తీవ్రమైన ముప్పు’’ అని హెచ్చరించారు. కాగా, పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఎస్‌సీవో వేదికలో ప్రస్తుతం భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్‌తో పాటు మొత్తం 10 పూర్తిస్థాయి సభ్యదేశాలు ఉన్నాయి.
స్వదేశానికి మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల (ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్) పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటనలో భాగంగా ఆయన పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతోపాటు బిష్కెక్‌లో జరిగిన ఎస్‌సీవో వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. మంగళవారం ఆయన స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. బిష్కెక్ విమానాశ్రయంలో మోదీకి కిర్గిస్తాన్ మంత్రివర్గ చైర్మన్ ఆదిల్‌బెక్ కాసిమలీవ్ వీడ్కోలు పలికారు.