Reading Time: < 1 minute
Konda Surekha Chinna Reddy Disciplinary Action Aicc Key Decision Today

AICC Disciplinary Action: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అంశంపై ఏఐసీసీ అధిష్ఠానం నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆయనతో భేటీ కానున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ మల్లు రవి ఇప్పటికే ఈ వ్యవహారంపై సిఫార్సులతో కూడిన నివేదికను ఏఐసీసీ అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘనలకు సంబంధించి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి సిఫార్సు చేసినట్లు మల్లు రవి వెల్లడించినట్లు తెలుస్తోంది.

పీసీసీ క్రమశిక్షణ సంఘం సిఫార్సులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కేసీ వేణుగోపాల్ విడివిడిగా సంప్రదింపులు జరపనున్నారు. ఈ చర్చల అనంతరం ఏఐసీసీ అధిష్ఠానం తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈరోజు సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో అధిష్ఠానం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు సీఎం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు.