
- ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్
హనుమకొండ, వెలుగు: దేశంలో ప్రశ్నిస్తే బొద్దింకలు, పరాన్నజీవులు అంటున్నారని ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ ఫైర్ అయ్యారు. జెన్ జీ పోరాటం ఆగిపోయేది కాదని, పాలకుల ప్రజా, విద్యార్థి వ్యతిరేక విధానాలపై యువతరం ఇకపై నిశ్శబ్ధంగా ఉండబోదని స్పష్టం చేశారు.
హనుమకొండ అంబేద్కర్ భవన్ లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అధ్యక్షతన మంగళవారం జెన్ జీ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం, నవతరం హక్కుల కోసం సాగిస్తున్న సమరం మరింత ఉధృతం కానుందన్నారు. విద్యారంగాన్ని కార్పొరేటీకరణ, కాషాయీకరణ వైపు తీసుకెళ్తున్న పాలకుల కుట్రలను జెన్ జీ సమర్థంగా తిప్పికొడుతోందన్నారు. దేశంలో విద్యా వ్యవస్థ మారాలన్నారు.
విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు, ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్య అందే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. అణచివేత, భయానక వాతావరణం సృష్టించి యువత గొంతు నొక్కాలని చూస్తున్నారని, సోషల్ మీడియా వేదికల నుంచి వీధి పోరాటాల దాకా జెన్ జీ ప్రశ్నించడం నేర్చుకుందని చెప్పారు. ఉపాధి లేమి, ఫీజుల పెంపు, స్కాలర్‌షిప్‌ల రద్దు, విద్యాసంస్థల్లో ప్రజాస్వామ్య హక్కుల కాలరాతపై యువత తిరగబడుతోందని, ఇకపై ఏ అన్యాయంపైనా ఈ తరం మౌనంగా ఉండదని స్పష్టం చేశారు.
దేశంలోని ప్రతి యూనివర్సిటీలో విద్యార్థుల స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడేందుకు ఎస్ఎఫ్ఐ కట్టుబడి ఉందన్నారు. క్యాంపస్‌లలో ఫాసిస్టు, విభజన శక్తుల ఆటలను సాగనివ్వబోమని తేల్చి చెప్పారు. యువత మౌనంగా ఉండొద్దని, వ్యవస్థలో మార్పు కోరుకోవాలన్నారు. ‘దేశ భవిష్యత్ నిర్మాతలం మనమేనని, యువత గర్వంగా తలెత్తుకుని నిలబడే దేశాన్ని నిర్మించాలి.’ అని పిలుపునిచ్చారు.
దేశంలోని ప్రభుత్వాలు మహిళల భద్రతల విషయంలో విఫలమవుతున్నాయని, ఢిల్లీ బస్సులో 16 ఏండ్ల బాలికపై అత్యాచారం ఆందోళన కలిగించిందన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, అధ్యక్షుడు రజనీకాంత్, ఉపాధ్యక్షులు దామెర కిరణ్, మమత, సుమ, రవి, నాయకులు మధు, స్మరణ, రాజ్, లవ కుమార్, గణేశ్, వినోద్, రవితేజ పాల్గొన్నారు.