
వినియోగదారులకు అత్యంత నమ్మకమైన, సురక్షితమైన అనుభవాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఏఐ ప్లస్ సంస్థ తన రాబోయే సరికొత్త ఫోన్‌ను ఎథికల్ హ్యాకర్లు, కంటెంట్ క్రియేటర్ల చేత ముందే పరిశీలింపజేస్తోంది. వినూత్న హంగులు, అసాధారణ భద్రతా ప్రమాణాలతో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ప్రాజెక్ట్ ఓపెన్ రివ్యూ 2.0
సాధారణంగా కొత్త ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాతే దాని పనితీరు, భద్రత గురించి సమీక్షలు వస్తుంటాయి కానీ ఏఐ ప్లస్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తోంది. భారత్‌లో నోవా 2 పవర్ 5జీ విడుదలకు ముందే సాంకేతిక నిపుణులు, సమీక్షకులు, కంటెంట్ క్రియేటర్లతో పాటు ఎథికల్ హ్యాకర్లకు కూడా ఈ ఫోన్‌ను అందించి పరీక్షించనుంది. ఫోన్‌లోని లోపాలను ముందుగానే గుర్తించి, వినియోగదారులకు మరింత నమ్మకమైన అనుభవాన్ని అందించాలన్నదే కంపెనీ ప్రధాన ఉద్దేశం. ఏఐ ప్లస్ ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ ఓపెన్ రివ్యూ 2.0’ కార్యక్రమంలో ఎంపికైన సాంకేతిక నిపుణులు, పాత్రికేయులు, కంటెంట్ క్రియేటర్లు ఫోన్‌ను విడుదలకు ముందే ఉపయోగించనున్నారు.
ఈసారి ఎథికల్ హ్యాకర్లను కూడా ఇందులో భాగం చేయగా వారు ఫోన్ భద్రత, గోప్యత, సాఫ్ట్‌వేర్‌లో ఉండే లోపాలను స్వతంత్రంగా పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి తమకు ఎదురైన అనుభవాలను స్వేచ్ఛగా పంచుకునే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతుండగా గతంలో నిర్వహించిన కార్యక్రమానికి 700కు పైగా దరఖాస్తులు రావడంతో ఈసారి మరింత మందికి అవకాశం కల్పిస్తున్నారు. డిజిటల్ రంగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ సంస్థ నిరంతరం ఆకర్షణీయమైన వ్యూహాలను అమలు చేస్తోంది.
చిప్‌సెట్, ఆపరేటింగ్ సిస్టమ్
ఈ నోవా 2 పవర్ 5జీ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌ను అందించనున్నారు. 6nm సాంకేతికతతో రూపొందిన ఈ శక్తివంతమైన చిప్‌సెట్ మల్టిపుల్ టాస్క్‌లు చేయడం, గేమ్స్ ఆడటం వంటి వాటికి సరిపడే అద్భుతమైన పనితీరును అందించనుంది. అయితే ఫోన్‌లోని ర్యామ్, నిల్వ సామర్థ్యం, బ్యాటరీ, డిస్‌ప్లే, కెమెరా పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ నోవా 2 పవర్ 5జీలో ప్రత్యేకంగా నెక్ట్స్‌క్వాంటం ఓఎస్ పనిచేయనుండగా గోప్యత, వ్యక్తిగత సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఈ వ్యవస్థను నెక్స్ట్‌క్వాంటం షిఫ్ట్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది.
ఈ సరికొత్త ఫోన్ గోల్డెన్ బ్లూ ఫ్యూజన్, బ్లూ ఫ్యూజన్ రంగుల్లో మార్కెట్లోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక రిటైల్ ధర, విడుదల తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లను ఏఐ ప్లస్ త్వరలోనే ప్రకటించాల్సి ఉంది. రోజువారీ ప్రయాణాలతో పాటు సురక్షితమైన డిజిటల్ అనుభవాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ ఫోన్ చక్కటి ఎంపికగా నిలుస్తుంది. మార్కెట్లో విడుదలైన తర్వాత ఇతర ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకు ఈ డివైజ్ గట్టి పోటీ ఇవ్వనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.