
తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా? భావోద్వేగంతో ఆమె పెట్టుకున్న కన్నీళ్ళు పొలిటికల్ అటెన్షన్ తీసుకువచ్చాయా? ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడిని టార్గెట్ చేయడం వెనక ఆమె వ్యూహం ఏంటి? ఆ విషయమై లోకల్‌గా ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి?
బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగా ఒక వెలుగు వెలిగారు కల్వకుంట్ల కవిత. పార్టీ కీలక నాయకురాలి హోదాలో… ఒక రకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలను శాసించారామె. ఇక సస్పెండ్ అయ్యాక బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత తొలిసారి జిల్లాలో పాంచజన్య సభ నిర్వహించారు కవిత. అదంతా ఒక ఎత్తయితే… సభలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటు ఆమె ప్రసంగం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. గతంలో శాసన మండలిలో కన్నీరు పెట్టిన కవిత…. తాజాగా మెట్టినింట జరిగిన సభలో అదే పని చేయడం టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయింది. అయితే… ఆమె కన్నీళ్ళకు చాలా పెద్ద కారణాలే ఉన్నాయన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి జిల్లాలో.
బీఆర్ఎస్‌కు స్థానికంగా పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కారణంగా చూపిస్తూ చేసిన కామెంట్స్ పొలిటకల్ హీట్ పెంచాయి. నిన్నటి వరకు గులాబీ అగ్ర నాయకత్వంపై విమర్శలు చేసిన కవిత… తాజాగా నిజామాబాద్ జిల్లా కీలక నేతకు గురిపెట్డడం వ్యూహంలో భాగమేనన్న అంచనాలున్నాయి. కవిత కారు పార్టీలో ఉన్నప్పుడు జిల్లా మొత్తంలో కేడర్‌కు ఆమే పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆమె కేంద్రంగానే జిల్లా రాజకీయాలు నడిచేవి. ఆ క్రమంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి-కవిత ఆధిపత్య పోరు ఉండేదట. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఆమె ఆయనకు శాపనార్దాలు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. కవిత గులాబీ పార్టీలో పవర్ సెంటర్‌గా ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేలకు, ఆమెకు మధ్య గ్యాప్ ఉండేదని అంటున్నారు.
అప్పట్లో ఆమె ఆధిపత్య ధోరణి చాలా మంది జిల్లా నేతలకు నచ్చేది కాదట. ఆ పరిస్థితుల్లోనే… 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటమికి జిల్లాకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే కారణం అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇందులో జిల్లాకు చెందిన నాయకులు ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి, జీవన్ రెడ్డి, షకీల్ పాత్ర చాలా ఉందని అవకాశం దొరికినప్పుడల్లా చెబుతున్నారట. ఇక తాజాగా వాళ్ళనే ఆమె మరోసారి టార్గెట్ చేశారనే టాక్ నడుస్తోంది. ఈసారి ఎన్నికల్లో వాళ్ళకు రిటర్న్ గిప్ట్ ఇస్తానని చెబుతున్నారట కవిత. అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళను తన రాడార్ పరిధిలోకి తీసుకున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు.
ఇదంతా పక్కా వ్యూహం ప్రకారం జరుగుతున్నదేనన్నది లోకల్ పొలిటికల్ అనాలసిస్. జిల్లాలో తిరిగి పట్టు సాధించేందుకే స్థానిక లీడర్లను టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అటు కవిత వాఖ్యలకు గులాబీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే షకీల్ గట్టిగా కౌంటర్స్ ఇస్తున్నారు. గెలుపు ఓటములు నియోజకవర్గ ప్రజల చేతుల్లో ఉంటాయి తప్ప…కవిత చేతుల్లో ఉండవన్నారు. ఇలా విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అటు కవిత కన్నీళ్ల పై కూడా ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేశారు. అదంతా….సెంటిమెంట్ రగిల్చేందుకేనని విమర్శించారాయన. అయితే… మెట్టినింట కవిత నిర్వహించిన సభ సక్సెస్‌తో తెలంగాణ రక్షణసేన ఉత్సాహంగా ఉందట.