Reading Time: < 1 minute
Vd Satheesan Kerala Cm Iufl Celebrations Political Controversy

Kerala: కేరళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పది రోజుల ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ హైకమాండ్ వి.డి. సతీశన్ (VD Satheesan)ను కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) శ్రేణులు చేసిన సంబరాలు పెను వివాదానికి దారితీశాయి. ఇడుక్కి జిల్లాలో లీగ్ కార్యకర్తలు నిర్వహించిన విజయ యాత్రలో రెచ్చగొట్టే నినాదాలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపింది. “లీగ్ పాలించే కేరళ గడ్డపై చట్టాలను నిర్ణయించేది కూడా లీగే” అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఈ ఊరేగింపులో సతీశన్‌ను కొనియాడుతూనే, మరోవైపు కేరళలోని ప్రముఖ సామాజిక వర్గాల నేతలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ఎస్ఎస్ (NSS) చీఫ్ సుకుమారన్ నాయర్, ఎస్ఎన్డీపీ (SNDP) యోగం ప్రధాన కార్యదర్శి వెల్లాపల్లి నటేశన్‌లను ఉద్దేశించి “వెల్లాపల్లి ఎవరు? సుకుమారన్ ఎవరు? ఇది పాణక్కాడ్ లీగ్.. సరిగ్గా చూసుకోండి” అంటూ దూషించడం విమర్శలకు తావిచ్చింది. తమ ఆత్మగౌరవాన్ని ఎవరి వద్ద తాకట్టు పెట్టలేమని ఈ సందర్భంగా కార్యకర్తలు నినదించారు. ముఖ్యమంత్రి రేసులో కె.సి. వేణుగోపాల్, రమేష్ చెన్నితాల పేర్లు ఉన్నప్పటికీ, ముస్లిం లీగ్ మొదటి నుంచి సతీశన్‌కే బహిరంగంగా మద్దతు తెలిపింది. 140 స్థానాలున్న అసెంబ్లీలో 22 మంది ఎమ్మెల్యేలతో యూడీఎఫ్ (UDF)లో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న లీగ్ ప్రభావం కాంగ్రెస్ నిర్ణయాలపై స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషణలు వస్తున్నాయి.

ఈ పరిణామాలపై బీజేపీ, సీపీఐ(ఎం) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ముస్లిం లీగ్ కనుసన్నల్లో నడుస్తోందని, వారి ఎజెండానే అమలు చేస్తోందని ఆరోపించాయి. కేరళను రాబోయే ఐదేళ్లు పరోక్షంగా ముస్లిం లీగే పరిపాలిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. సతీశన్ ఎంపిక వెనుక ముస్లిం లీగ్, జమాత్-ఏ-ఇస్లామీ వంటి సంస్థల ఒత్తిడి ఉందని ఆయన ఆరోపించారు. కాగా, ఈ వివాదం ముదరడంతో ముస్లిం యూత్ లీగ్ తన ఇడుక్కి జిల్లా కమిటీని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. మొత్తానికి వి.డి. సతీశన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే, మిత్రపక్షాల అత్యుత్సాహం ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.