Reading Time: 2 minutes
Gautam Gambhir Files Case Against Ai Deepfakes In Delhi High Court

Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్‌ గంభీర్.. తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏఐ డీప్‌ఫేక్‌లు, నకిలీ వీడియోలు మరియు అనధికారిక వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.. గంభీర్ తన పిటిషన్‌లో, తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ విస్తృతంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికలపై ఏఐ టెక్నాలజీ, ఫేస్ స్వాప్, వాయిస్ క్లోనింగ్ ద్వారా తాను చెప్పని మాటలు చెప్పినట్లు చూపించే వీడియోలు తయారు చేస్తున్నారని తెలిపారు.

2025 చివరి నుండి ఈ నకిలీ కంటెంట్ భారీగా పెరిగిందని గంభీర్ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. కొన్ని వీడియోలు లక్షల సంఖ్యలో వీక్షణలు సాధించడంతో ప్రజల్లో అపోహలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా గంభీర్ పేరు, ఫోటోలను ఉపయోగించి అనుమతి లేకుండా పోస్టర్లు మరియు ఇతర ఉత్పత్తులు విక్రయిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో Amazon, Flipkart వంటి ఈ-కామర్స్ సంస్థలు, అలాగే Meta Platforms, Google, YouTube, X వంటి టెక్ కంపెనీలను ప్రతివాదులుగా చేర్చారు.

తన పిటిషన్‌లో గంభీర్ మొత్తం 16 మంది ప్రతివాదులపై కేసు వేస్తూ, తన వ్యక్తిత్వ హక్కులను రక్షించాలంటూ కోర్టును కోరారు. ఈ సందర్భంగా ఆయన రూ.2.5 కోట్ల నష్టపరిహారం కోరడమే కాకుండా, నకిలీ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని, భవిష్యత్తులో తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగించకుండా నిషేధించాలని అభ్యర్థించారు. ఈ కేసులో గంభీర్ కాపీరైట్ చట్టం 1957, ట్రేడ్‌మార్క్ చట్టం 1999 మరియు వాణిజ్య న్యాయస్థానాల చట్టాన్ని ప్రస్తావించారు. అలాగే Amitabh Bachchan, Anil Kapoor కేసుల్లో వచ్చిన పర్సనాలిటీ రైట్స్‌కు సంబంధించిన తీర్పులను కూడా ఉదాహరణగా చూపించారు. నా గుర్తింపును ఒక ఆయుధంగా వాడుకున్నారు. నా పేరు, ముఖం, గొంతు దుర్వినియోగం చేయబడ్డాయి. ఇది కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, చట్టం మరియు గౌరవానికి సంబంధించిన విషయం అని గౌతమ్‌ గంభీర్ పేర్కొన్నారు. అయితే, ఈ కేసుపై Delhi High Court మార్చి 20న విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో వచ్చే తీర్పు భవిష్యత్తులో ఏఐ డీప్‌ఫేక్‌ల నియంత్రణ మరియు వ్యక్తిత్వ హక్కుల రక్షణకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.