Reading Time: 2 minutes

మరోసారి వివాదస్పదంగా సామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మీకు అలవాటేనంటూ బీజేపీ కౌంటర్

Caption of Image.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ సామ్ పిట్రోడా వ్యాఖ్యలు మరోసారి వివాదస్పదంగా మారాయి. ఇతర దేశాలకు సేవ చేసేందుకే భారతీయుల నైపుణ్యాలు ఉపయోగపడుతున్నాయన్న పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ భగ్గమన్నది. ఆయన కామెంట్స్‎కు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. భారతీయులను అవహేళన చేయడం.. ప్రపంచ దేశాల ముందు భారతీయులను తక్కువ చేసి మాట్లాడటం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 

పిట్రోడా ఏం అన్నారంటే..?

ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ పిట్రోడా మాట్లాడుతూ.. భారత యువతలో ఎంతో ప్రతిభ ఉంది కానీ దానిని దేశీయ ఆవిష్కరణల కోసం దానిని ఉపయోగించుకోవడంలో ఇండియా విఫలమైందని అన్నారు. మన యువతను ఇతర దేశాలు విరివిగా వాడుకుంటున్నాయన్నారు. ప్రోగ్రామింగ్, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, పరిశ్రమలు ఇలా ఎన్నో రంగాల ఆవిష్కరణల్లో భారత దేశ యువతే ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. సుమారు 150 కోట్ల జనాభా ఉన్న దేశానికి దాని స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోవడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

‘‘మేం మా సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను సృష్టించలేదు. మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీని కూడా ప్రారంభించలేదు. సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేయలేదు. 1.5 బిలియన్ల జనాభా ఉన్న దేశానికి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోవడం బాధాకరం. మొబైల్ ఫోన్‌ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా నిర్మించలేకపోయాము. మేము నిజంగా మా ప్రతిభను ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగించాం’’ అని పిట్రోడా వ్యాఖ్యానించారు.

ఇండియా పరువు తీయడమే కాంగ్రెస్ లక్ష్యం: బీజేపీ

పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. సామ్ పిట్రోడా ఇండియాను అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా పిట్రోడా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. లష్కర్ ఇ కాంగ్రెస్ముఖ్య సలహాదారు మరోసారి భారత్‌ను అబద్ధాలతో అపహాస్యం చేశారని విమర్శించారు. 

పిట్రోడా మరోసారి భారత్ ను తిట్టే ఎజెండాతో వచ్చాడని.. అబద్ధాలతో భారత్‌ను ఎగతాళి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కనీసం సొంత ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‎ను కూడా తయారు చేసుకోలేదన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. BOSS Linux, Maya OS, PrimeOS, BharOS, Indus OS,  NxtQuantum OSలను భారతీయులే అభివృద్ధి చేశారని కౌంటర్ ఇచ్చారు. భారత్‌ను అబద్ధాలతో నాశనం చేయడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యమని ఫైర్ అయ్యారు. 

©️ VIL Media Pvt Ltd.