Reading Time: < 1 minute

కరీంనగర్ కుర్రాళ్లూ.. బర్త్ డే పేరుతో రోడ్లపై ఇట్ల జేస్తే జైలుకే..!

Caption of Image.

పిచ్చి ముదిరి పాకాన పడింది అంటారు చూడండి.. అలాంటిదే ఈ ఘటన. బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో పెద్ద పెద్ద తల్వార్లతో నానా హంగామా చేయడమే కాకుండా జనాలను భయపెట్టడం, కొట్టడం చేస్తే పోలీసులు చూస్తూ కూర్చుంటారా..? బొక్కలో వేస్తారు అంటారు కదా. అదే చేశారు. బర్త్ డే పేరుతో అర్ధరాత్రి నడి రోడ్డుపై తల్వార్లతో హంగామా చేసిన రౌడీ బ్యాచ్ ను అరెస్టు చేశారు కరీంనగర్ రూరల్ పోలీసులు .

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 అర్థరాత్రి యువకులు కారు పైకెక్కి తల్వార్ తో బర్త్ డే కేక్ కట్ చేయడమే కాకుండా, బాణాసంచా కాల్చి ప్రజలను భయాందోళనలకు గురిచేశారు.  తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు స్థానికులు. దీంతో యువకులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

Also Read : కరీంనగర్ రేకుర్తిలో పిల్లలకు విషమిచ్చిన తల్లి

సెలబ్రేషన్స్ సందర్భంగా బర్త్‌ డే బ్యాచ్ ఇద్దరు యువకులపై దాడికి దిగారు. డబ్బులు, మొబైల్ ఫోన్లు లూటీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో వాలకుంట్ల అజయ్, ముక్కెర విఘ్నేష్, గుంజ రంజిత్ అనే యువకులను అరెస్ట్ చేశారు. మొత్తం 9 మంది  నిందితుల్లో 6 మంది మైనర్లు ఉండటం ఆందోళన కలిగించే విషయం. 

బర్త్ డే బ్యాచ్ దాడిలో చరణ్, యుగంధర్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి.  రెండు మొబైల్ ఫోన్లు ధ్వంస చేయడంతో పాటు రెండు వేల నగదును బలవంతంగా తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. గొడవ పెద్దది కావడంతో స్థానికులు స్పందించి.. దాడి చేసిన బ్యాచ్‌ను చెదరగొట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

స్థానికుల ఫిర్యాదు మేరకు  వెంటనే నిందితులను గుర్తించి అరెస్టు‌ చేశామని రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు. బర్త్ డే, సెలబ్రేషన్స్ పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు.

©️ VIL Media Pvt Ltd.