Reading Time: < 1 minute
Ab De Villiers Backs Rcb For Multiple Ipl Titles Praises Virat Kohli Ahead Of Ipl 2026

మరో కొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సందడి మొదలు కానుంది. మార్చి 28న లీగ్ మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ట్రోఫీని నిలబెట్టుకుంటుందని జోస్యం చెప్పాడు. ఆర్సీబీ జట్టులో కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడి పైనే భారం ఉండబోదని డివిలియర్స్ స్పష్టం చేశాడు.

ఆర్సీబీ విజయవకాశాల గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘జట్టులో కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడి పైనే భారం ఉండబోదు. ఆర్సీబీ జట్టులో పోరాడే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారంతా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇదే సమతూకం వారిని మళ్ళీ విజేతలుగా నిలుపుతుంది’ అని అభిప్రాయపడ్డాడు.

Also Read: Ugadi 2026-YS Jagan: ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు!

డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ తరచూ చెప్పే మాటలను డివిలియర్స్ గుర్తు చేసుకున్నాడు. ‘మనం ఒక్కసారి కప్పు గెలిస్తే చాలు.. ఆ తర్వాత వరుసగా రెండు, మూడు, నాలుగు ట్రోఫీలు సులువుగా గెలవగలమని విరాట్ ఎప్పుడూ చెబుతుండేవాడు. కోహ్లీ మాటలను నేను పూర్తిస్థాయిలో నమ్ముతున్నా. ఆర్సీబీ ఈసారి దుమ్మురేపడం ఖాయం. రాబోయే సీజన్లలో బెంగళూరు వరుస విజయాలతో చరిత్ర సృష్టిస్తుంది’ అని ఏబీడీ ఆశాభావం వ్యక్తం చేశాడు. విరాట్, డివిలియర్స్ కలిసి చాలా ఏళ్లు ఆర్సీబీకి ఆడిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.