Reading Time: 2 minutes
Israel Us Attack Iran South Pars Gas Field Global Oil Prices India Impact

Israel-Iran War: ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడి ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ దాడికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. రాబోయే కొద్ది గంటల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్‌లోని ఐదు ఇంధన సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు దాదాపు 110 డాలర్లకు చేరగా, గ్యాస్ ధరలు సైతం పెరుగుదల నమోదు చేశాయి. ఇరాన్‌కు చెందిన అస్సలు ముఖ్యమైన ఎనర్జీ హబ్ అయిన అస్సాలూయెహ్ ప్రాంతంలో ఉన్న పెట్రోకెమికల్ యూనిట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రపంచ ఎనర్జీ సరఫరాకు వెన్నెముకలాంటిదిగా భావించే ఈ గ్యాస్ ఫీల్డ్‌లో మంటలు చెలరేగడం ఆందోళనలను మరింత పెంచింది. సౌత్ పార్స్–నార్త్ డోమ్ రిజర్వాయర్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిల్వగా గుర్తించబడింది. ఈ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో ఖతార్ కూడా భాగస్వామి. ఖతార్ ఈ ఫీల్డ్ నుంచే పెద్ద ఎత్తున LNG ఉత్పత్తి చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తుంది. ఇక్కడ ఏ చిన్న అంతరాయం వచ్చినా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌పై నేరుగా ప్రభావం పడుతుంది.

READ MORE: UstaadBhagatSingh Review : ఉస్తాద్ ఓవర్శీస్ రివ్యూ.. ఇలా అయితే ఎలా హరీష్

ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. సౌత్ పార్స్–నార్త్ డోమ్ రిజర్వాయర్ ఏటా బిలియన్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తూ, ఇరాన్ దేశీయ అవసరాలను తీరుస్తోంది. ఖతార్ ఈ క్షేత్రం నుంచి భారీ పరిమాణంలో ఎల్‌ఎన్‌జిని వెలికితీసి ప్రపంచానికి ఎగుమతి చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రంలో అగ్నిప్రమాదం సంభవించడంతో, సరఫరా గొలుసుకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్ దీనికి ప్రతిస్పందిస్తోంది. దీని ఫలితంగా చమురు, గ్యాస్ ధరలు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం, గ్యాస్ కంటే చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దీనిని బట్టి, మార్కెట్లు మొదట భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, సరఫరా ఆందోళనలకు ప్రతిస్పందిస్తున్నాయని తెలుస్తోంది. ఇక సహజ వాయువు ధరల పెరుగుదల, సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంలోని అగ్నిప్రమాదంతో ముడిపడి ఉన్న ప్రమాదాన్ని వ్యాపారులు ఇప్పటికే గ్యాస్ ధరలలో పరిగణనలోకి తీసుకుంటున్నారని చూపిస్తుంది.

READ MORE: Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

భారతదేశంపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇటీవల జరిగిన దాడి భారతదేశంలోని గ్యాస్ ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మార్చి 18న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల అసలుయే (బుషెహర్ ప్రావిన్స్)లోని ఫేజ్ 14 వంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు, పైప్‌లైన్‌లు, యూనిట్లు దెబ్బతిన్నాయి. దీంతో మంటలు చెలరేగి, గ్యాస్ ఉత్పత్తికి పాక్షికంగా అంతరాయం కలిగింది. మార్చి నెల ప్రారంభంలో, ఇరాన్ డ్రోన్ దాడులు ఖతార్ ఎనర్జీకి చెందిన రాస్ లఫాన్, మెసాయిద్ ప్లాంట్లపై జరిగాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు (LNG) ఉత్పత్తిదారు అయిన ఆ సంస్థ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయవలసి వచ్చింది. ఇది ప్రపంచ LNG సరఫరాలలో సుమారు 20 శాతాన్ని ప్రభావితం చేసింది. భారత్‌ తన LNG అవసరాల కోసం ఖతార్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. ఖతార్‌లో ఉత్పత్తి నిలిచిపోవడం, హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు సరఫరా గొలుసుకు అంతరాయం కలిగిస్తున్నాయి. భారత్ ఏటా 14 మిలియన్ టన్నులకు పైగా LNGని దిగుమతి చేసుకుంటుంది. LPGలో 80-85% గల్ఫ్ దేశాల (ఖతార్, సౌదీ అరేబియా, మొదలైనవి) నుంచి వస్తుంది. ఈ దాడుల నేపథ్యంలో, రాబోయే గంటల్లో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌లలోని ఐదు చమురు కేంద్రాలపై దాడి చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. చమురు, గ్యాస్ కేంద్రాలపై మరిన్ని దాడులు జరిగితే భారతదేశపు చమురు, గ్యాస్ సంక్షోభం మరింత తీవ్రతరం కావచ్చు.